గవర్నర్ పదవి కోసం కొన్నేళ్లుగా వేచి చూస్తున్న తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు! రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమిస్తుందనీ, ఆ జాబితాలో తన పేరు తప్పకుండా ఉంటుందనీ, అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలాసార్లు సిఫార్సులు చేశారు కాబట్టి, పని అయిపోతుందని అనుకున్నారు! మానసికంగా ఆయన ఏనాడో గవర్నర్ అయిపోయారు. కానీ, శనివారం నాడు ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. ఆ జాబితాలో మోత్కుపల్లి పేరు లేదు! ఓరకంగా ఆయనకి ఇది షాకే. ఎందుకంటే, మోత్కుపల్లికి పదవి గ్యారంటీ అనేట్టుగా వెంకయ్య నాయుడు కూడా గతంలో సంకేతాలు ఇచ్చారు. కానీ, ఏదీ కార్యరూపం దాల్చలేదు. దీంతో మోత్కుపల్లి కొంత అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. నిజానికి, మోత్కుపల్లిలో గవర్నర్ గిరీ ఆశల్ని ఈ స్థాయిలో మొదట్నుంచీ పెంచింది ఎవరంటే… అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు!
ఆ మధ్య తెలంగాణ టీడీపీకి చెందిన కొంతమంది ప్రముఖ నేతలు విజయవాడ వెళ్లి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలుసుకున్నారు. ఈ సందర్భంలో వారి చర్చల్లో మోత్కుపల్లి గవర్నర్ పదవి ప్రస్థావన వచ్చింది. ఆయన పదవి విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారనీ, దశాబ్దాలుగా పార్టీకి కట్టుబడి ఉంటున్న ఆయన సేవల్ని కేంద్రం వినియోగించుకుంటుందని చంద్రబాబు నమ్మకంగా చెప్పేశారు! తాను ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా కేంద్రంతో ఈ విషయం మాట్లాడుతూనే ఉన్నాననీ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని, ఆయన సేవలకు గుర్తింపు లభిస్తుందని, దళిత నేతకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తుందని కూడా టి.నేతలతో చంద్రబాబు చెప్పారు. ఇంత భరోసాగా చంద్రబాబే చెబితే.. ఎవరైనా ఎందుకు ఆశలు పెట్టుకోరు చెప్పండీ. మోత్కుపల్లి కూడా అదే చేశారు. కానీ, కేంద్రం నిర్ణయంమరోలా ఉంది.
దీంతో చంద్రబాబు చెబితే ఢిల్లీలో పని జరిగిపోతుందనే పరిస్థితి లేదని అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాల్లో కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. అడిగిన ఒక్క పదవిని కూడా ఎన్డీయే ఇవ్వకపోవడం విశేషం. సరే, ఢిల్లీలో చంద్రబాబుకు ఉన్న పరపతి గురించి కాసేపు పక్కన పెడితే… దశాబ్దాలుగా పార్టీకి కట్టుబడి ఉంటూ వస్తున్న మోత్కుపల్లి రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు చర్చనీయమే. ఎందుకంటే, గవర్నర్ గిరీ వస్తుందన్న ఆశతో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో ఆయన ఏమంత చురుగ్గా పాల్గొనడం లేదు. ప్రజలకు కూడా అందుబాటులో లేరనే విమర్శ ఉంది. గవర్నర్ పదవి వస్తే.. వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుందే ముందస్తు ఆలోచనతో రాష్ట్ర రాజకీయాలపై కూడా మోత్కుపల్లి ఆసక్తి తగ్గించుకుంటూ వచ్చారనే చెప్పొచ్చు. ఇప్పుడు కేంద్ర ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. ఈ నేపథ్యంలో ఊరిస్తూ ఉసురు తీసిన టీడీపీపై అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. నిజానికి, మోత్కుపల్లి విషయంలో మొదట్నుంచీ కాస్త అప్రమత్తంగా చంద్రబాబు వ్యహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. గవర్నర్ పదవి అనేది మన చేతిలో లేదూ.. కానీ, మన ప్రయత్నం మనం చేస్తున్నాం అని చెప్పి ఉన్నా సరిపోయేది. మరి, ఇప్పుడు మోత్కుపల్లికి చంద్రబాబు ఏమని సర్ది చెబుతారో చూడాలి.