తెలుగుదేశం నేతలు ఓ పదునైన విమర్శనాస్త్రాన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రతీదానికీ దాన్నే వాడేస్తున్నారు. అదేంటంటే.. ‘ప్రతిపక్షం అభివృద్ధిని అడ్డుకుంటోంద’నే ప్రచారం! ఈ మధ్య ముఖ్యమంత్రితో సహా ప్రముఖ టీడీపీ నేతలందరూ ఇదే అస్త్రాన్ని బాగానే వాడుతున్నారు. ఇప్పుడు, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కూడా కాస్త ఆలస్యంగా ఇదే తరహాలు విమర్శలు చేయడం విశేషం. ఆంధ్రాలో తెలుగుదేశం సర్కారు చేస్తున్న అభివృద్ధిని చూసి వైకాపా నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. అందుకే, కొందరు ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని అన్నారు. వైకాపా ఎంపీల తీరు వల్లనే రాష్ట్రానికి చెందిన ఉపాధి హామీ కూలీలకు రావాల్సిన సొమ్ము విషయంలో తీవ్ర జాప్యం జరిగిందని సీఎం రమేష్ చెప్పుకొచ్చారు. జులై 20న వైవీ సుబ్బారెడ్డి, మే 11న అవినాష్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారన్నారు! ఉపాధి కూలీలకు విడుదల కావాల్సిన ఫండ్స్ జాప్యం వెనక ఈ ఇద్దరు చేసిన ఫిర్యాదులే కారణమన్నారు. రూ. 11 వందల కోట్ల ఉపాధి హామీ బిల్లులు అడ్డుకునేందుకు వీరు ప్రయత్నించారనీ, ఆ కూలీల ఉసురు వీరికి తగులుతుందని సీఎం రమేష్ అన్నారు.
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ వీరు చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపారనీ, ఎలాంటి ఇబ్బందులేవని క్లీన్ చిట్ ఇచ్చారనీ, త్వరలోనే ఆ నిధులు రాబోతున్నాయని సీఎం రమేష్ చెప్పారు. ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఇలానే ప్రతిపక్షం అడ్డు తగులుతోందని ఎంపీ ఆరోపించారు. కృష్ణా జలాలను దోచుకుంటున్నారంటూ సాక్షి పత్రికలో రాశారనీ, దీని వల్లే కృష్ణా బోర్డుకు మంత్రి హరీష్ రావు ఫిర్యాదు చేశారన్నారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు ఎలా రాబట్టాలా.., మరిన్ని పథకాలు ఎలా తెచ్చుకోవాలా అనే అంశంపై ప్రతిపక్షం సలహాలు ఇవ్వాల్సింది పోయి.. ఇలా అడ్డుపడుతూ ఉండటం తగదన్నారు. వైకాపాలో కొంతమంది ఎంపీలకు ఈ ఫిర్యాదులు ఇష్టం లేదనీ, కానీ జగన్ బంధువులు ఒకరిద్దరు మాత్రం రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అన్నారు.
సీఎం రమేష్ చెప్పిన విషయాల్లో ఆసక్తికరమైనవి రెండు! ఒకటీ.. సలహాలు ఇస్తే తీసుకుంటామని! వాస్తవాలు మాట్లాడుకుంటే.. ప్రతిపక్షం సలహాలపై సానుకూలంగా స్పందించే పరిస్థితి రాష్ట్రంలో ఉందా..? రాజకీయాలన్నీ క్రెడిట్ గేమ్ మీద నడుస్తున్న ఈ రోజుల్లో ప్రతిపక్షం సూచనలు పాటించే పరిస్థితి ఎక్కడ ఉంటుంది..! ఇక, రెండోది.. ‘రాష్ట్ర సర్కారుపై ఫిర్యాదు చేసేందుకు కొంతమంది ఎంపీలు సిద్ధం లేకపోయినా’ అనడం, మిగతా ఎంపీలు సహకరించకున్నా ఇద్దరు ఫిర్యాదులు చేశారనడం! ఈ కామెంట్ల వెనక ఉద్దేశం ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! ఏదేమైనా.. దొరికిన ప్రతీ అవకాశాన్ని విపక్షాన్ని ఇరుకున పెట్టే అస్త్రంగా మార్చుకోవడంలో టీడీపీ ఏమాత్రం తగ్గడం లేదు! అభివృద్ధి నిరోధక శక్తి అనే ముద్ర వేస్తూ ఆ విధంగా ముందుకు పోతోంది. ప్రస్తుతం సర్కారు చేపడుతున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా వచ్చే ఎన్నికల్లోపు ఏవైనా పూర్తి కాలేదే అనుకోండి.. కారణం ఇదే చెప్తారేమో! వైకాపా అడ్డుపడుతూ ఉండటం వల్లనే అని ప్రచారం చేస్తారేమో! సర్కారు వైఫల్యం అనేది ఒకటుంది ఉంటుందనే కోణం వైపు ప్రజల ఆలోచనలు వెళ్లనీయకుండా అడ్డుకట్ట వేస్తారేమో!