డ్రగ్స్ కేసు.. ఒక నెల రోజులపాటు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. మీడియాలో హాట్ హాట్ గా చర్చ జరిగింది. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులకు డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నాయంటూ కొంతమందిని విచారణకు పిలిచింది సిట్. దర్శకుడు పూరీ జగన్నాథ్ మొదలుకొని వరుసగా కొంతమందిని విచారించింది. ఆ విచారణ పూర్తవగానే చర్యలు అలా ఉంటాయీ, ఇలా ఉంటాయీ, బ్రహ్మాండం బద్దలైపోతుందీ అనే రేంజిలో ఊహాగానాలు వినిపించాయి. తీగ లాగి డొంకంతా పీకేస్తున్నాం అన్నట్టుగా అధికారులు హడావుడి చేశారు. విచారించిన ప్రముఖుల నుంచి శాంపిల్స్ సేకరించారు. వాటిని పరీక్షించడమే ఆలస్యం, వెంటనే కఠిన చర్యలు ఉంటాయన్నారు. అంతన్నారు, ఇంతన్నారు.. కానీ, ఆ తరువాత ఏమైంది..? డ్రగ్స్ కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పడి ఉంది. ఇన్నాళ్ల తరువాత.. కేసులో మళ్లీ కదలిక వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఈ కేసు విచారణలో భాగంగా రక్త నమూనాలు, జుత్తు, గోళ్లు వంటి కొన్ని నమూనాలను సేకరించారు అధికారులు. కొందరు స్వచ్ఛందంగా నమూనాలు ఇస్తే, మరికొందరు నిరాకరించారు కూడా! అయితే, ఇలా సేకరించిన నమూనాలకు ఇంతవరకూ పరీక్షలు జరగకపోవడం విశేషం! సేకరించిన వాటిని అప్పుడే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి పంపించారు. అప్పట్నుంచీ ఆ శాంపిల్స్ అన్నీ ల్యాబ్ లోనే మగ్గుతున్నాయి. ఇంతవరకూ వాటికి పరీక్షలు జరగకపోవడం విశేషం. కారణం ఏంటంటే… ఆ నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించేందుకు కావాల్సిన రసాయనాలు అక్కడ లేవట! బయట్నుంచి తెప్పించుకోవచ్చు కదా… అంటారా! ఇండియాలోనే ఎక్కడా ఆ రసాయనాలేవో లేవట! పోనీ, విదేశాల నుంచి తెప్పించుకోవచ్చుగా! అదే చేశామనీ, ఆ ఏర్పాట్లన్నీ ఇన్నాళ్లకు పూర్తయ్యాయనీ, వచ్చే వారం నాటికి సదరు రసాయనాల దిగుమతి చేసుకుంటున్నాం అంటూ ఓ అధికారి చెప్పడం విశేషం. అవి వచ్చిన వెంటనే పరీక్షల ప్రక్రియ మొదలౌతుందని చెబుతున్నారు! పరీక్షలు అయిన వేంటనే నివేదికను సిట్ అధికారులకు ఇచ్చేస్తారట! నివేదిక అందిన వేంటనే అధికారులకు చర్యలకు దిగుతారట!
నిందితుల నుంచి సేకరించిన నమూనాల పరీక్షలకే ఇన్నాళ్లు టైం పడితే… కేసు పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! అంతెందుకు, డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా రెండో లిస్టు రెడీ అయిపోయిందనీ, పేర్లన్నీ సిద్ధమనీ, ప్రింట్ కొట్టడమే ఆలస్యం అన్నట్టుగా అప్పట్లో అధికారులు బిల్డప్ ఇచ్చారు. ఆ జాబితాలో ప్రముఖుల వారసుల పేర్లున్నాయంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. కానీ, ఆ లిస్టేమైందో తెలీదు. ఇప్పుడు మళ్లీ ఏదో కదలిక అంటున్నారుగానీ.. అది కూడా నత్తనడకనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా!