ఒక అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో రాజకీయ పార్టీల ఇన్వాల్వ్ మెంట్ , వ్యూహ ప్రతివ్యూహాల తో జరిగిన సింగరేణి కాలరీస్ లిమిటెడ్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆరెస్ అనుబంధ సంస్థ (TBGKS-తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం) విజయ ఢంకా మోగించింది. మొత్తం 11 డివిజన్లలో 9 లో విజయం సాధించింది. మిగిలిన 2 డివిజన్లలో కాంగ్రెస్ అనుబంధ ఏఐటీయూసీ కూటమి విజయం సాధించింది. గతంలో ఎప్పుడూ లేనంత ఉత్కంఠభరితంగా ఈసారి ఎన్నికలు జరగ్గా టీబీజీకేఎస్ తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది.
మొత్తం 52,534 మంది కార్మికులు ఓటు హక్కును కలిగి ఉండగా 49,873 మంది (94.93%) వినియోగించుకొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు కవిత సారథ్యంలో గెలుపు సాధ్యమయిందని టీఆరెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తెరాస, టీబీజీకేఎస్ శ్రేణులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నాయి.