నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల తరువాత టీడీపీ ఓ ప్రచారానికి తెర తీసింది. ప్రతిపక్ష పార్టీ వైకాపా నుంచి టీడీపీకి భారీగా వలసలు ఉండబోతున్నట్టు నాయకులు లీకులు ఇచ్చారు. కొంతమంది నేతలు తనలో ఫోన్ లో టచ్ లో ఉంటున్నారనీ, వైకాపాలో ఉండలేమని తనతో చెబుతున్నారంటూ ఈ మధ్యనే మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, అసలు వ్యూహమంతా రాయలసీమ కేంద్రంగా టీడీపీ అమలు చేస్తోందనే చెప్పాలి. ఆ ప్రాంతం నుంచి వీలైనంత మంది వైకాపా నాయకుల్ని ఆకర్షించాలని అనుకుంటోంది. దీన్లో భాగంగా కొంతమంది మంత్రులకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు కూడా కథనాలు వచ్చాయి. అయితే, ఈ క్రమంలో వైకాపా ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు కథనాలు వచ్చాయి. ఆమెతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎమ్మెల్యే కూడా వైకాపాకి రామ్ రామ్ చెప్పేస్తారంటూ వినిపించింది.
ఈ కథనాలపై రేణుక స్పందించారు. తాను వైకాపాలోనే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. పార్టీ అధినేత జగన్ తో తనకు ఎలాంటి విభేదాలూ లేవని, ఇవన్నీ కావాలనే ఓ పథకం ప్రకారం కొంతమంది చేయిస్తున్న ప్రచారం అంటూ కొట్టిపారేశారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతా అనే కథనాలు కల్పితాలు అంటూ ఆమె ఖండించారు. దీంతో బుట్టా రేణుకపై వస్తున్న కథనాలకు ఇకపై ఫుల్ స్టాప్ పడుతుందని అనుకోవచ్చు. ఇదే తరుణంలో అనంతపురం జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యే గురునాథ రెడ్డి కూడా టీడీపీలో చేరబోతున్నట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ విషయం జగన్ వరకూ వచ్చిందనీ, ఆయనతో ఓ కీలక నేత చర్చించారని కూడా అంటున్నారు! త్వరలో అనంతపురంలో చేపట్టనున్న యువభేరి కార్యక్రమంలో ఆ జిల్లా నేతలతో జగన్ సమావేశం అవుతారనీ, నాయకుల మధ్య విభేదాలపై ఆ సందర్భంగా చర్చించి, ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని చెబుతున్నారు. దీంతోపాటు సీమ ప్రాంత ఎమ్మెల్యేల అందరిపైనా ఓ కన్నేసి ఉంచారనీ సమాచారం!
మొత్తానికి, వలసల విషయంలో వైకాపా కాస్త జాగ్రత్తపడ్డట్టుగానే కనిపిస్తోంది. బుట్టా రేణుక విషయమై చాన్నాళ్లుగా కథనాలు వస్తున్నాయి. కానీ, ఆమె ఇప్పటివరకూ నిర్ద్వంద్వంగా ఇలా ఖండించింది లేదు. రేణుక తాజా స్పందన వెనక పార్టీ సూచనలూ సలహాలూ ఉండే ఉంటాయనే కొంతమంది అంటున్నారు. ఇంకోపక్క, గురునాథ రెడ్డి విషయంలోనూ వైకాపా కాస్త జాగ్రత్తగా ఉందనే అనిపిస్తోంది. అయితే, జగన్ పాదయాత్ర మొదలయ్యేలోపు కొంతమందినైనా వైకాపా నుంచి బయటకి తెద్దామనేదే టీడీపీ లక్ష్యంగా పెట్టుకుందట! మరి, వైకాపా నుంచి మొదలైన ఈ బుజ్జగింపులు, ముందు జాగ్రత్త చర్యలు ఆ పార్టీ నేతల్ని అధికార పార్టీవైపు వెళ్లనీయకుండా ఎంతవరకూ కట్టడి చేస్తాయో చూడాలి.