అవును, మీరు కరెక్ట్ గానే చదివారు. చిరంజీవి పిసిసి సభ్యుడిగానే ఎన్నికయ్యరు. సిడబ్ల్యూసి, ఎ ఐసిసి సభుడు కాదు, పిసిసి ఏ. అందులోనూ చిరంజీవి అడిగి మరీ, కోరి మరీ, ఈ సభ్యత్వం తీసుకున్నారని, దీని కోసం మళ్ళీ ఒక ముస్లిం యువతి త్యాగం చేసిందనీ వస్తున్న వార్తలు చూస్తుంటే అసలు ఎలా స్పందించాలో కూడా చిరంజీవి అభిమానులకి అర్థం కావడం లేదు.
చిరంజీవి పి ఆర్పీ ని విలీనం చేసిన కొత్తలో సిడబ్ల్యూసీ లో పదవి ఇస్తానంటే ఆయన తిరస్కరించారు. కాకలు తీరిన రాజకీయనాయకులు చాలా మంది ఆ పదవి విలువ చిరంజీవి కి తెలీకే దాన్ని వద్దన్నాడని అనుకున్నారు. దేశం లో కాంగ్రెస్ తీసుకునే అన్ని నిర్ణయాలని చర్చించే అత్యున్నత కమిటీ మరి అది. అలాంటి చిరంజీవి ఇప్పుడు కేవలం పిసిసి సభ్యుడిగా అవాలని రఘువీరారెడ్డిని కోరడం, అందులోనూ ప.గో. జిల్లా నుంచే కావాలని కోరడం, అది కూడా సభ్యత్వ నియమకాలు పూర్తయాక కోరడం, అప్పుడు రఘువీరారెడ్డి ప.గో. జిల్లా లో ముందురోజే పిసిసి సభ్యురాలిగా ఎన్నికైన అమర్ జహా బేగ్ అనే మహిళా నేతని తప్పించి ఆ పదవి ని చిరంజీవికి ఇప్పించడం చకచకా జరిగిపోయాయి. అమర్ జహా బేగ్ కుటుంబం కూడా చిరంజీవి కోసం ఆనందంగానే ఈ పదవి వదులుకున్నట్టు తెలుస్తోంది. అయితే అసలు చిరంజీవి ఇప్పుడు ఈ పిసిసి సభ్యుడు అవాలని ఎందుకనుకున్నాడో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
2018 లో రాజ్యసభ ముగుస్తుంది కాబట్టి, మళ్ళీ రాజ్యసభకి పంపే అవకాశం లేదు కాబట్టి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తామని ఏమైనా సమాచారమందిందా అనే డౌట్లు కూడా ఉన్నాయి. అక్టోబర్ 10 న పిసిసి సర్వ సభ్య సమావేశముంది. ఆ తర్వాత పిసిసి అధ్యక్ష పదవి కి ఎన్నిక ఉంది. మరి పిసిసి అధ్యక్ష పదవి కోసమా ఇది..లేకపోతే రాజకీయాల నుంచి పూర్తి గా తప్పుకుంటారనే వార్తలకి చెక్ పెట్టే ఉద్దేశ్యం తో ఇలా చేసారా అనేది కూడా చర్చ జరుగుతోంది. ఇంకో వర్గం మాత్రం పవన్ , లెఫ్ట్, లోక్ సత్తా తో కలిసి బిజెపి వ్యతిరేక కూటమి లో ఉండి చెప్పుకోదగ్గ సీట్లు సాధిస్తే కాంగ్రెస్ ని జనసేన ని భవిష్యత్తు లో సమన్వయం చేసే కారణం తో చిరంజీవి కి కాంగ్రెస్ లో మంచి పొజిషన్ దక్కే వీలుంటుంది కాబట్టి చిరంజీవి ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాడని అంచనా వేస్తున్నారు .
కానీ ఒక్కటి మాత్రం నిజం. బొత్స లాంటి వాళ్ళు పిసిసి అధ్యక్షుడిగా చేసారు. ఇప్పుడు చిరంజీవి పిసిసి సభ్యుడిగా ఎన్నికవుతున్నాడు. అదీ ఏ ఎఐసిసి యో, సీడబ్ల్యూసీ యో కాదు. ముఖ్యమంత్రి పదవికి పోటీదారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఇప్పుడిలా పిసిసి సభ్యుడిగా అవడం చూస్తుంటే కొంతమంది అభిమానులు మాత్రం, “ఎందుకన్నయ్యా ఈ రాజకీయాలు. హ్యాపీ సినిమాలు చేసుకోక” అనుకునేదాకా వచ్చింది. ఏది ఏమైనా ఎప్పటిలాగే రాజకీయాల్లో చిరంజీవి వేసే అడుగులు ఆయన ఫ్యాన్స్ కి మింగుడు పడనివే !!