‘సర్వే’ జనా సుఖినో భవంతు! నల్గొండ ఉప ఎన్నిక జరుగుతుందో లేదో తెలీదు! ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేస్తారో లేదో స్పష్టత లేదు. ఇంతకీ ఈ ఎన్నిక ఎవరి ప్రయోజనాల కోసం అనే చర్చ లేదు. ఉప ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితిని ఎందుకు సృష్టిస్తున్నారనే ప్రశ్న లేదు. ఇవన్నీ వదిలేసి, ఓ మీడియా సమగ్ర సర్వే నిర్వహించేసింది! నల్గొండ ఉప ఎన్నిక వస్తే అధికార పార్టీ తెరాస విజయం సాధిస్తుందని ఆ సర్వేలో తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిపై తెరాస ఏకంగా లక్ష ఓట్ల మెజారిటీ ఖాయం అని స్పష్టం చేశారు. అంతేకాదు, ఉప ఎన్నిక ప్రకటన ఇంకా అధికారికంగా జరగలేకపోయినా ఇప్పటికే కాంగ్రెస్ – తెరాసల మధ్య ఏడు శాతం ఓట్ల తేడా కనిపిస్తోందని చెప్పారు. అంటే, ఎన్నికల ప్రకటన తరువాత ఈ తేడా మరింత పెరుగుతుందని చెప్పడమే కదా! ఈ సర్వే కోసం తేరా చిన్నపరెడ్డిని తెరాస అభ్యర్థిగా, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అభ్యర్థగా పెట్టారు.
నల్గొండ ఉప ఎన్నికపై ఇంతవరకూ అన్నీ ఊహాగానాలే! గుత్తా రాజీనామా చేసిందీ లేదు. ఉప ఎన్నికకు వెళ్తామని కేసీఆర్ కూడా ఘంటాపదంగా చెప్పిందీ లేదు. అన్నిటికీ మించి… ఇప్పుడీ ఉప ఎన్నిక అవసరమా..? సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుకోవడమే ఈ ఉప ఎన్నిక లక్ష్యం. ఇలాంటప్పుడు బాధ్యతగల మీడియా పోషించాల్సిన పాత్ర ఏంటీ..? ఇలా ఉప ఎన్నికలకు వెళ్లడం సరైంది కాదని సూటిగా స్పష్టంగా చెప్పాలి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉప ఎన్నికలకు వెళ్లడం అనేది అధికార దుర్వినియోగం అవుతుందని ఎత్తి చూపాలి. ఎన్నికల ప్రక్రియ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. బోలెడంత ప్రజాధనం ఖర్చు. ఇలా ఇష్టం వచ్చినట్టుగా, తమ పార్టీ పట్టు తెలుసుకోవడం కోసమే ఎన్నికలు నిర్వహించడాన్ని నిర్ద్వంద్వంగా తప్పుబట్టాలి.
అధికార పార్టీ వారు ఎన్నికలు అనగానే మీడియా సంస్థగా సర్వేకు వెళ్లిపోవడం ఎంతవరకూ సరైందనేదే చర్చ! ప్రభుత్వాలకు మీడియా మార్గదర్శకంగా నిలవాలి. అధికార పార్టీ గాడి తప్పుతుంటే దిశానిర్దేశం చేయాలి. ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అంతేగానీ, ఇలా సర్వేలు చేయించేసి, ‘ఫర్వాలేదు మీరు ఎన్నికలకు వెళ్లొచ్చ’ని అధికార పార్టీని ప్రోత్సహిస్తున్నట్టుగా వ్యవహరించడం సరైంది కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. నల్గొండ ఉప అనేది ఏ కోణంలో చూసినా ఇప్పుడు అనవసరం! ప్రాక్టికల్ గా చూసుకున్నా.. మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు వచ్చే వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు గుత్తాతో రాజీనామా చేయించినా.. ఎన్నికల సంఘం వెంటనే ఉప ఎన్నిక నిర్వహిస్తుందనే నమ్మకం లేదు. ఈ విషయం సదరు మీడియా సంస్థకు తెలియంది కాదు. తెలిసీ ఈ స్థాయి సర్వే ఏంటనేది కొంతమంది ప్రశ్న. సరే.. పార్టీ మూడ్ ఎలా ఉందో తెలుసుకోవడమే కేసీఆర్ సాబ్ ఆలోచన అనుకుంటే.. ఈ సర్వే సరిపోతుంది కదా. తాజా సర్వేలో తెరాస గెలుస్తుందని, లక్షకుపైగా మెజారిటీ వస్తుందని స్పష్టం చేశారు కదా! పార్టీ మూడ్ ఎలా ఉందో అర్థమైపోయింది కదా!