వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలవారీగా టీడీపీ కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది! రాయలసీమ జిల్లాల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రతీ నియోజక వర్గం నుంచీ టీడీపీ అభ్యర్థులుగా ఎవరు ఉండబోతారు అనేది రానురానూ స్ఫష్టమౌతోంది. స్థానిక రాజకీయ సమీకరణాలకు అనువుగానే అభ్యర్థుల ఎంపిక ఉండబోతోందనేది అర్థమౌతూనే ఉంది! ఈ నేపథ్యంలో.. మంత్రి నారాయణ వ్యవహారం ఇప్పుడు టీడీపీలో చర్చనీయంగా మారుతోందని తెలుస్తోంది. ఎందుకంటే, ఆయన ప్రత్యక్ష ఎన్నికల ద్వారా రాజకీయాల్లోకి ఇంతవరకూ రాలేదు కదా! మొదట్నుంచీ తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితులుగా మెలిగారు. ఆ తరువాత, ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. మంత్రి పదవి దక్కింది. టీడీపీలో కీలక శక్తిగా ఎదిగారు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావాలనే ఆలోచనలో నారాయణ ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. అందుకే, ఆయన తన వ్యవహార శైలికి భిన్నంగా ప్రజల్లో తిరుగుతూ ఉండటం విశేషం!
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని తన ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశానికి వేదికగా మార్చుకుంటున్నారు మంత్రి నారాయణ. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అందుకే, నెల్లూరు విషయంలో ముందెన్నడూ లేనంత శ్రద్ధ కనబరుస్తున్నారని అంటున్నారు! ఇంటింటికీ కార్యక్రమంలో భాగంగా ఆయన బాగానే తిరుగుతున్నారు. నాయకుడి పాత్రలోకి ప్రవేశించారు! దుకాణాల్లో టీ పెడుతున్నారు. దుస్తులు ఇస్త్రీ చేస్తున్నారు. మటన్ దుకాణాలకు వెళ్లి మాంసం కొడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలతోనూ భుజం మీద చేతులు వేసుకుని మరీ సరదా సరదా మాట్లాడుతున్నారు. మరో ఏడాదిలోగా ఒక పూర్తి స్థాయి నాయకుడిగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఓరకంగా ఇది నారాయణకు సవాలే! అధికార పార్టీలో కీలక పాత్ర పోషించడం వేరు.. ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు పొందడం వేరు. అయితే, ఈ ప్రయత్నమేదో ఇంతకుముందే మొదలుపెట్టి ఉంటే సరిపోయేది. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు వరకూ ఆగి.. ఇప్పటికిప్పుడు ఒకేసారి ప్రజల్లోకి వచ్చేసి, తాను ప్రజల మనిషిని అని ప్రకటించుకోవడం కోసం రకరకాల ఫీట్లు చేయడం అనేది… ఎంతవరకూ కలిసొస్తాయో మరి! ఇక, నెల్లూరు విషయానికొస్తే.. అక్కడ టీడీపీలో ఇప్పటికే కొన్ని వర్గాలున్నాయి. సిటీలో కాస్త మంచి పేరున్న ఆనం సోదరులకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కృష్ణారెడ్డి కూడా ఇప్పేడేమంత క్రియాశీలంగా లేరు. సో.. ఏ రకంగా చూసుకున్నా నారాయణకు పోటీ పడేవారు ఎవ్వరూ లేరు. అలాగని, సవాళ్లు లేవనీ చెప్పలేం. నారాయణకి ఇక్కడ టిక్కెట్ ఇస్తే… ఆనం సోదరులు, కృష్ణారెడ్డి వర్గం, మేయర్ అజీజ్ వర్గం ఏమేరకు సహకరిస్తాయో అనేది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అవుతుంది.