నాగార్జున ఇది వరకెప్పుడూ లేని గెటప్లోకనిపిస్తున్నారు. మీసం తీసేసిన నాగ్ లుక్స్ అభిమానుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఆయనేమైనా కొత్త పాత్ర కోసం ట్రై చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాగ్ ఎక్కడకు వెళ్లానా.. మీసం గురించిన ప్రశ్నలే. `ఏదో సరదాకి..` అని నాగ్ ఎన్నిసార్లు సమాధానం చెప్పినా ఎవ్వరికీ తృప్తి కలగడం లేదు. దాంతో నాగ్‌కి ఈ ప్రశ్నపై స్పందించీ, స్పందించీ విసుగొచ్చేసినట్టుంది. ఓ టీవీ షోలో `మీసం`పై ప్రశ్నించిన యాంకర్ని సున్నితంగా మందలించారు. ఇప్పుడు ‘రాజుగారి గది 2’ విజయోత్సవంలోనూ నాగ్‌కి ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే ఈసారి కాస్త నవ్వుతూనే సమాధానం చెప్పారు. ”మీసం పెంచినా, తీసేసినా అడుగుతారేంటి? నా మీసం నా ఇష్టం” అంటూ ఈ ప్రశ్నల పరంపరకు పుల్‌స్టాప్ పెట్టేసే సమాధానం ఇచ్చారు.
రాజుగారి గది 2 సక్సెస్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు నాగ్. ”ఒక్క పాట, ఫైటూ లేకుండా సినిమా తీయడానికి గట్స్ ఉండాలి. పీవీపీ, ఓంకార్, తమన్, అబ్బూరి రవి.. ఈ చిత్ర విజయానికి నాలుగు మూల స్థంభాలు. వాళ్ల కష్టం వల్లే ఈసినిమా నిలబడింది. ఓంకార్ పర్ఫెక్షన్ కోసం చాలా ఇబ్బంది పెట్టేవాడు. ‘నువ్వు నటించు.. నేను మోనేటర్ దగ్గర కూర్చుంటా’ ఓసారి విసుక్కొన్నా. ఇదంతా తాను సినిమా కోసం పడిన తపన” అని చెప్పుకొచ్చాడు నాగ్. ఈ విజయం తనకో పెళ్లి కానుక అని సమంత వివరించింది.