రేవంత్ రెడ్డి రాజకీయ కదలికల నేపథ్యంలో మరోసారి ఓటుకు నోటు కేసు తెరపైకి వస్తుంది. అందరూ దాన్ని గురించి మాట్లాడుతుంటారు. అయితే ఆ కేసు ఇప్పటికే దాదాపు మూతపడిపోయిందన్నది నిజం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి నిష్క్రమించాక టిడిపి టిఆర్ఎస్లు సర్దుకున్నాక ఆ కేసుకు రాజకీయ పదును పోయింది. పైగా రేవంత్‌పై కక్షతో దాన్ని బయిటకు తీస్తే చంద్రబాబు పేరు టిడిపి కూడా వివాదంలోకి వస్తాయి. అలాగాక రేవంత్‌కే పరిమితం చేసి చంద్రబాబు తదితరులను తప్పిస్తే అప్పుడు ఆయన అప్రూవర్‌గా మారి ఏమైనా చెప్పొచ్చు. అది మరీ ప్రమాదమవుతుంది. స్వభావాన్ని బట్టి అప్రూవర్‌గా మారే అవకాశం వుండదు గాని అందరూ కలసి తనను బలిచేశారనే కోపం ఏమైనా చేయించొచ్చు. ఈ అంచనాలన్నీ వున్నాయి గనకే చంద్రబాబు నాయుడు దీనిపై ఏమీ మాట్లాడకుండా కాలక్షేపం చేస్తున్నారు. రేవంత్‌ను ఏమీ అనకుండానే కెసిఆర్‌ను మంచి చేసుకున్నారు.ఈ స్థితిలో తనకు వేరే మార్గం ఏముందని రేవంత్ అంటున్నారు. ఇదంతా ఒక గొలుసుకట్టు క్రమం. ఈ మొత్తంలో ఎక్కడా ఓటుకు నోటు కేసు వూపందుకునే పరిస్థితి కనిపించదు.