బాహుబలి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అన్ని చోట్లా.. వసూళ్ల సునామీ అంటే ఎలా ఉంటుందో చూపించింది. తమిళ నాట కూడా ఓ రేంజులో విజృంభించింది. అక్కడి సూపర్ స్టార్ రజనీకాంత్ సాధించిన వసూళ్లని అవలీలగా కొట్టేసింది. ఇప్పటికీ బాహుబలి 2 రికార్డుల్ని అక్కడ ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. ఆ అవకాశం విజయ్‌కి ఉందని తమిళ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాహుబలి 2 తమిళ నాట దాదాపుగా రూ.130 కోట్లు సాధించింది. దాన్ని విజయ్ సినిమా క్రాస్ చేస్తోందని అభిమానులు నమ్ముతున్నారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం తమిళనాట విజయఢంకా మోగించింది. రివ్యూలు కాస్త అటూ ఇటుగా వచ్చినా, విజయ్ అభిమానులకు మాత్రం తెగ నచ్చేసింది. దాంతో ఈ సినిమాపై రేగిన వివాదాలు కూడా… భారీ ప్రచారం తీసుకొచ్చాయి. 4500 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే రూ.40 కోట్లు సాధించింది. ప్రస్తుతం వంద కోట్ల మైలు రాయికి అతి దగ్గరలో ఉంది. ఆదివారం కూడా సెలవు రోజే కాబట్టి… ఈ వసూళ్ల ఉధృతి ఇంకా కొనసాగే అవకాశాలున్నాయి.
ఈ జోరు మరో వారం రోజులున్నా కచ్చితంగా బాహుబలి 2 రికార్డుని విజయ్ దాటొచ్చు. పైగా అక్కడో హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. ప్రేక్షకులూ మంచి ఆకలితో ఎదురుచూస్తున్నారు. విజయ్ సినిమా హిట్టయితే ఆ రేంజే వేరుగా ఉంటుంది. ఇప్పుడు తమిళ నాట అదే కనిపిస్తోంది. బాహుబలి 2 రికార్డుని విజయ్ సినిమా దాటేస్తుందా? అని విజయేంద్ర ప్రసాద్‌ని అడిగితే.. ”వసూళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పటి వరకూ అయితే దాటేస్తోంది అనిపిస్తోంది. రెండు సినిమాలకూ రచయిత నేనే కదా.. అందుకే ఆనందంగానే ఉంటుంది” అంటున్నారాయన.