కుల ప్రస్థావన లేకుండా ప్రజలను కూడగట్టలేరా..? సామాజిక వర్గాల సాయం లేనిదే ప్రజలను ఆకర్షించలేరా..? అంటే, ముమ్మాటికీ లేరనే చెప్పాలి! తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఇలానే ఉంది. కులం పేరును బహిరంగంగా ప్రస్థావిస్తూ… తమ కులస్థులంతా సంఘటితమయ్యే సమయం వచ్చిందని టి. కాంగ్రెస్ నేతలు పిలుపునిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కులాల ప్రస్థావనే కీలకంగా మారిపోతుంది. తెలుగుదేశాన్ని చెంతకు చేర్చుకోవడం ద్వారా సీఎం కేసీఆర్ కూడా చేస్తున్నది ఈ తరహా రాజకీయమే కదా! అదే బాటలో కాంగ్రెస్ కూడా రెడ్డి రాజకీయానికి తెర తీసింది..! కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఇన్నాళ్లూ తెర చాటున ఉండే కుల ప్రస్థావనలు.. ఇప్పుడు ప్రెస్ మీట్ల వరకూ వచ్చేశాయి. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాటలు వింటే ఆ పార్టీ విధానామేంటో ఇట్టే అర్థమైపోతుంది.
‘రెడ్డి సోదరులారా.. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న రెడ్డి నాయకులారా.. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది’ అంటూ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు! ఆ ఒక్క కులం సంఘటితం అయినంత మాత్రాన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేయదు కదా! ఇతర కులాల ఓట్లు కూడా కావాలి కదా! ఆ విషయం జగ్గారెడ్డికి తెలియందేం కాదు. అందుకే, రెడ్లతో ఇతర సామాజిక వర్గాలకు ఉన్న సంబంధాల గురించి చిత్రంగా మాట్లాడారు! రెడ్డీలకు ఎస్సీలతో అవినాభావ సంబంధం ఉందన్నారు. రెడ్లకు బీసీలతో అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. అక్కడితో ఆగినా కొంత నయం. వెలమ వ్యతిరేకతను కూడా బయట పెట్టేసుకున్నారు! వెలమలకు ఎస్సీలకు సరైన సంబంధాలు లేవని సెలవిచ్చారు! వెలమలకూ బీసీలకు కూడా ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. కాబట్టి, రెడ్డి సోదరులారా, రెడ్డి నాయకులారా ఏకం కావాలంటూ, ఆ సమయం వచ్చిందని జగ్గారెడ్డి నిర్భీతిగా పిలుపు నిచ్చారు.
రెడ్లను ఏకం కావాలని పిలుపునివ్వడం ఒకెత్తు అయితే, ఇతర సామాజిక వర్గాలతో వారికున్న సంబంధాలు గురించి చెప్పడం విడ్డూరం! వెలమలతో అలాంటి సంబంధాలు లేవని కూడా చెప్పడం ఇంకా విచిత్రం! అధికారం కోసం ఏం చేయడానికైనా కాంగ్రెస్ రెడీ అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? కులాల పేర్లను ఇంత నిస్సిగ్గుగా ప్రస్థావిస్తూ… ఆ ప్రాతిపదికనే ప్రజలను ఎన్నికలకు సమాయత్తం చేయడానికి జగ్గారెడ్డి చేస్తున్న కృషిని ఏమని అభివర్ణించాలి..? కులాలను రెచ్చగొట్టినా ఫర్వాలేదు, మనం అధికారంలోకి వస్తే చాలు అనే అకుంటిత దీక్షతో రెడ్ల ఏకీకరణ అనే గురుతర బాధ్యతల్ని భుజస్కందాలపై వేసుకున్న జగ్గారెడ్డి కృషిని ఏ విశేషణంతో పొగడాలో అర్థం కావడం లేదు! ఉపమానాలకు అందని ఆదర్శ రాజకీయాలకు తెర తీస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి, సామాజిక జీవనాన్ని ప్రభావితం చేస్తాయా, రెడ్లను వెనకేసుకుని వెలమలను వ్యతిరేకిస్తే ఏవైనా నిరసనలు వ్యక్తమౌతాయా, యువతను పెడతోవ పట్టిస్తున్నామా, సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాం, మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా… ఇలాంటి విచక్షణా బుద్ధిని హుస్సేన్ సాగర్ లో ముందుగా నిమజ్జనం చేసి, ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. పాపం శమించుగాక..!