అందాల రాక్షసితో ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది లావణ్య త్రిపాఠి. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన విజయాలతో టాప్ లీగ్‌లోకి చేరింది. అయితే ఈమధ్య లావణ్య కెరీర్ బాగా డల్ అయ్యింది. సినిమాలు చేస్తున్నా.. హిట్ మాత్రం దూరంగా జరుగుతోంది. మిస్టర్, యుద్దం శరణం, రాధ… ఇవన్నీ ఫ్లాపులే. ప్రస్తుతం ‘ఉన్నది ఒకటే జిందగీ’లో ఓ కథానాయికగా కనిపించనుంది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠితో తెలుగు 360 చేసిన చిట్ చాట్ ఇది.
హాయ్ లావణ్య..
– హాయ్…
ఈమధ్య కెరీర్ కాస్త డల్ అయినట్టుంది..
– అదేం లేదండీ.. ఈ యేడాది నా నుంచి వస్తున్న నాలుగో చిత్రమిది. ఒక్క రోజు కూడా ఖాళీగా లేను. ఓ నటికి అంతకంటే కావల్సింది ఏముంది?
సినిమాలు చేసినా, అందులో హిట్సేం కనిపించడం లేదు కదా?
– హిట్టూ, ఫ్లాపుల గురించి ఆలోచిస్తే ఎలా? నా కెరీర్లో అందాల రాక్షసి, భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, సోగ్గాడే లాంటి మంచి సినిమాలున్నాయి. దాన్ని కూడా గుర్తించు కోవాలి కదా? ప్రతీ సినిమా ఓ అనుభవం. వాటి నుంచి ఏదో ఒకటి నేర్చుకొంటూనే ఉంటాం. జయపజయాలు సెకండరీ.
ఉన్నది ఒకటే జిందగీలో రెండో నాయిక పాత్ర కదా?
– రెండో కథానాయిక అని కాదు, ఇందులో ఇద్దరు కథానాయికలున్నారు. అందులో నాదో స్థానం. సినిమాలో ఎంతమంది కథానాయికలున్నారు, నా పాత్ర ఎంతసేపు అనే లెక్కలెప్పుడూ వేసుకోలేదు.
సరే… ఇందులో మీ పాత్రేంటి?
– మేఘ అనే అమ్మాయిగా కనిపిస్తా. చాలా బబ్లీగా ఉండే క్యారెక్టర్ నాది. జీవితంలో ఏదో సాధించాలి అనే ఆశయం కూడా ఉంటుంది. నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండే పాత్ర. చాలా ఎంజాయ్ చేశా.
రామ్‌తో తొలిసారి నటించారు, ఆ అనుభవాలేంటి?
– రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నా. మా ఫ్రెండ్సంతా.. రామ్‌తో కలసి నటించు, మీ జోడీ బాగుంటుంది అనే వారు. ఆ అవకాశం ఇప్పుడొచ్చింది.
ప్రేమ, స్నేహం, జీవితం గురించి చెప్పే సినిమా ఇది… మరి జీవితంపై మీ ఫిలాసఫీ ఏమిటి?
– నాదంతా టేక్ ఇట్ ఈజీ పాలసీ. దేని గురించీ పెద్దగా ఆలోచించను. స్నేహితులకు ఎక్కువ విలువ ఇస్తా. అందుకే ఈ సినిమాలో చాలా సీన్లు నాక్కూడా కనెక్ట్ అయ్యాయి.
ఈ పాత్ర కోసం ముందు మేఘా ఆకాష్‌ని సంప్రదించారు. ఆమె స్థానంలో మీరొచ్చారు. ఈ సంగతి మీకు తెలుసా?
– తెలుసు. సినిమా రంగంలో ఇది చాలా సర్వసాధారమైన విషయం. కొన్ని సార్లు డేట్లు కుదరక సినిమాల్ని వదులుకోవాల్సి వుంటుంది. నేనూ అల చాలా సినిమాల్ని వదులుకొన్నా.
ఎలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తున్నారు?
– మగధీరలాంటి వారియర్ కథలంటే చాలా ఇష్టం. అలాంటి అవకాశం వస్తే.. తప్పకుండా చేస్తా. పిరియాడికల్ సినిమాలన్నా ఇష్టమే.
ఈ మధ్య హారర్ సినిమాల జోరు ఎక్కువైంది.. అలాంటి ఆఫర్లు మీకొస్తే..?
– అస్సలు చేయను. నాకు హారర్ సినిమాలు చూడడం చాలా ఇష్టం. చేయడం కాదు. అలాంటి సినిమాల్లో నేను బాగుండను. నాకు ప్రేమకథలే ఇష్టం. వాటిలో చక్కగా ఇమిడిపోతాను.
హారర్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏమిటి?
– ఇటీవల రాజుగారి గది 2 చూశా. చాలా బాగుంది. సమంత చాలా చక్కగా నటించింది. ఆమె నటన గురించి పరిశ్రమ మొత్తం మాట్లాడుకొన్నారు.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలొస్తే…?
– చేస్తా. కానీ కథ నచ్చాలి. సినిమా మొత్తాన్ని నేను నడిపించగలను అనే నమ్మకం దర్శకుడికి, ఆ పాత్రలో నేను ఇమిడిపోతానన్న భరోసా నాకూ ఉండాలి.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలేంటి?
– సాయిధరమ్ తేజ్ – వినాయక్ సినిమాలో నటిస్తున్నా. ఈ యేడాది ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా గడిపా. అందుకే కాస్త గ్యాప్ తీసుకోవాలని వుంది. ఇక నుంచి కథల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలనుకొంటున్నా.
ఓకే… ఆల్ ద బెస్ట్
– థ్యాంక్యూ…