తెలుగుదేశంలో బాగా మాట్లాడగలిగిన నేతలలో ఒకరుగా పేరున్న పయ్యావుల కేశవ్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సంభాషణపై ఎన్ని వ్యాఖ్యలు విమర్శలు వచ్చినా మౌనం వీడకుండా సహనం పాటిస్తున్నారు. పరిటాల శ్రీరాం పెళ్ళికి వెళ్లిన కెసిఆర్ హెలిపాడ్ దగ్గర కేశవ్‌తో మాట్లాడటం కావాలని సృష్టించిన ఈవెంట్ ఆయనతో వెళ్లిన ఆర్కే స్పష్టంగానే రాశారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ మొత్తం ఉదంతంపై అసంతృప్తి ఆగ్రహం వెలిబుచ్చారు. ఇదంతా జరుగుతుంటే ఇదమిద్దంగా వివరణ ఇవ్వాల్సిన కేశవ్ అమెరికా వెళ్లిపోయారు. పార్టీవర్గాలూ ఆయనకు కాస్త దూరదూరంగా సంచరించినట్టు ఒక యువనేత చెప్పారు. అమెరికానుంచి తిరిగివచ్చిన తర్వాత కూడా కేశవ్ మీడియా ముందుకు రాలేదు. ఈ లోగో రేవంత్ రెడ్డి ఫిరాయింపు దుమారం వేడెక్కడం ఆయనకు మేలు చేసింది. రేవంత్ ఆరోపణల్లో కేశవ్‌తో మాట్లాడ్డం కూడా ఒకటి. ఆ సమయంలో వారు వెల్కం ఫార్ములాను ప్రస్తావించుకున్నారని ప్రత్యక్ష ప్రముఖ సాక్ష్యుల కథనం. టిఆర్ఎస్ నేతలూ అదే మాట్లాడుతున్నారు. కాబట్టి కేశవ్ ఖండించడం కూడా సులభం కాదు. అసలే గత కొంతకాలంగా అసంతృప్తితో వున్న కేశవ్ కు ఈ పరిస్థితి పులిమీద పుట్రలాటిదే. అయితే ఆట్టే కాలం ఆయన మౌనంగా వుండకపోవచ్చు. సమయస్పూర్తిగా మాట్లాడగలరు గనక ఏదో ఒక సందర్భం చూసుకుని వివరణతో ముందుకు రావచ్చు.