ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే ఆరు నెలలు చాలా కీలకంగా మారబోతున్నాయి. నిజానికి, ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర సమయం కనిపిస్తున్నా. ఆర్నెల్ల తరువాతే ఉండబోతున్నాయన్నట్టుగా ప్రధాన పార్టీల్లో హడావుడి పెరిగిపోతోంది. ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రకు బయలుదేరుతున్నారు. ఆ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇంకోపక్క, దీనికి ధీటుగా పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై టీడీపీ కూడా పక్కా ప్రణాళికతోనే సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. మొత్తానికి.. రాబోయే ఆర్నెల్లలోనే ఎన్నికల కాక పుట్టించేందుకు అధికార, ప్రతిపక్షాలు సిద్ధమౌతున్నాయి. సరిగ్గా ఇదే తరుణంలో కూడా జనసేన కూడా జనంలోకి రాబోతోంది! రాబోయే ఆరు నెలల్లో పార్టీ తరఫున కార్యక్రమాలు చేపట్టేందుకు జనసేనాని సంసిద్ధమౌతున్నారు. పూర్తిస్థాయిలో జనంలోకి వెళ్లేందుకు కావాల్సిన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే అంశమై హైదరాబాద్ లోని కార్యాలయంలో పార్టీకి చెందిన కొంతమంది ప్రముఖులతో పవన్ తాజాగా భేటీ అయ్యారు. సభ్యత్వ నమోదు, పార్టీ ప్లీనరీ, తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటనలకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ప్రజల్లోకి రాబోతున్నట్టు పవన్ ఇదివరకే ప్రకటించారు. అయితే, బస్సు యాత్ర చేస్తారా, పాదయాత్ర చేస్తారా, వేరే ఆలోచన ఉందా అనే తర్జనభర్జనపై కూడా ఈ మధ్య కొంత చర్చ జరిగింది.
అయితే, జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా ప్రధాన ప్రతిపక్షం వైకాపాకి సమాంతరంగా అనిపిస్తూ ఉంటాయి, ఎందుకో మరి..? పవన్ గతంలో చేపట్టిన కార్యక్రమాలుగానీ, సభలుగానీ.. ఏవి తీసుకున్నా వైకాపా కంటే ముందుగా, లేదా వైకాపాకి మించిన ప్రాధాన్యత లభించేట్టుగా ఆయా ఇష్యూస్ ను పవన్ ఓన్ చేసేసుకుంటున్న సందర్భాలే ఎక్కువ! రాజధాని అమరావతి ప్రాంత నిర్వాసిత గ్రామాల సమస్యే తీసుకుంటే.. జనసేనానే అప్పుడు పోరాటానికి దిగారు. బలవంతపు భూసేకరణలు ఆపకపోతే తాను కార్యాచరణ ప్రకటిస్తానంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దాంతో ప్రభుత్వం నోటిఫికేషన్ ను తాత్కాలికంగా ఆపింది. మరో ఉదాహరణ.. ప్రత్యేక హోదా అంశం. రాష్ట్రంలో వరుసగా ఓ నాలుగు సభలు పెట్టేశారు, కేంద్రం తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా కోసం జనసేన పోరాడుతుందీ అన్నారు. ఇంకో ఉదాహరణ.. ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల విషయంలో పవన్ స్పందించారు. విదేశీ వైద్య బృందాలతో ఉద్దానం వెళ్లారు. ఆ తరువాత చంద్రబాబు దగ్గరకి వెళ్లారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించేసింది. మరో ఉదాహరణ.. వ్యవసాయ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందనీ, నియామకాల్లో వారికి ప్రాధాన్యత ఉండటం లేదంటూ పవన్ స్పందించారు. వెంటనే ప్రభుత్వం స్పందించింది.
ప్రజల సమస్యలు కాబట్టి పవన్ స్పందించొచ్చు, ప్రభుత్వమూ చర్యలు తీసుకోవచ్చు. కానీ, ఇక్కడి రాజకీయ కోణం చూస్తే.. ప్రతిపక్షం కంటే ముందుగా, ప్రతిపక్షం కంటే ప్రభావవంతంగా, ప్రతిపక్షం కంటే తీవ్రంగా జనసేన గళం వినిపించే ప్రయత్నం ప్రతీసారీ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు, ప్రతిపక్ష పార్టీ నేత జగన్ పాదయాత్రకు బయలుదేరుతున్నారు. ఈ ఆర్నెల్లూ వైకాపాకి చాలా కీలకం అనడంలో సందేహం లేదు. ఆర్నెల్లపాటు ఏపీలో ఇదే హాట్ టాపిక్ కాబోతోంది. ఇదే సమయంలో జనసేనాని కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యటన చేయాలనే ప్రతిపాదన తెర మీదికి రావడం కాకతాళీయమే అనుకుందాం! కానీ, ప్రతీసారీ జరుగుతున్నదీ ఇప్పుడు కూడా జరుగుతోందా అనిపిస్తోంది! అదేనండీ.. ప్రతిపక్ష కార్యక్రమాల కంటే, జనసేనానివైపే జనం ఫోకస్ డైవర్ట్ అయ్యే కార్యక్రమం. ఇది వ్యూహాత్మక కార్యాచరణో… లేదంటే, అలా కలిసి వస్తోందో తెలీదుగానీ.. జనసేనాని ప్రతీసారీ కరెక్ట్ టైంలో జనంలోకి వచ్చేస్తుంటారు, అదేంటో మరి!