నవంబరు 2 నుంచి తాను తలపెట్టిన పాదయాత్ర కోసం ప్రతి శుక్రవారం హాజరుకావాలనే షరతును సడలించవలసిందిగా ఎపి ప్రతిపక్ష నేత జగన్ చేసిన అభ్యర్థనను సిబిఐ కోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో అనేక దఫాలుగా వాదోపవాదాలు జరిగినా కోర్టు అభిప్రాయం మార్చుకోలేదు. వారంలో ఒక్కరోజు వచ్చినంత మాత్రాన మిగిలిన రోజులలో యాత్రకు ఎలాటి ఆటంకం వుండదనే వైఖరి తీసుకున్నది. దానివల్ల యాత్ర ప్రభావం పలచబడుతుందని ఆయన తరపు న్యాయవాది చేసిన వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఇక ఇప్పుడు జగన్ తన యాత్ర గురించి పునరాలోచిస్తారా లేక కొత్త ప్రణాళిక వేసుకుంటారా అన్నది చూడాలి. హెలికాఫ్టర్ వంటిదానిలో వచ్చి వెళుతూ లాంఛనంగా శుక్రవారం కూడా కొద్దిసేపు నడిచే అవకాశం వుపయోగించుకోవచ్చు. అలాగాక ప్రతి శుక్రవారం ఆపేట్టయితే అప్పుడు కేసులలో చిక్కుకుపోయాడని తెలుగుదేశం నాయకులు ప్రచారం చేసే వీలుంటుంది. అలాగాక కోర్టుకు హాజరుకాకపోతే న్యాయమూర్తి ఎలా స్పందిస్తారో తెలియదు. ఒక వేళ ఈ తీర్పు కారణంగా యాత్ర విరమిస్తే అప్పుడు మరింత అపహాస్యం చేసే అవకాశం వుండొచ్చు. దీనిపై అప్పీలుకు వెళతామని అంటున్నారు గాని హైకోర్టు ఇదివరకే పరిశీలించి కిందకు పంపించింది. కనుక పాదయాత్రకు ఇదో ధర్మసంకటంగానే వుండబోతుంది. జగన్ పిటిషన్ను తోసిపుచ్చడంపై కూడా రాజకీయ విమర్శలు చేయడానికి టిడిపి ఆస్త్రాలు సిద్ధం చేసుకుంది. శాసనసభ కూడా ఇందుకు వేదిక అవుతుంది. ఏది ఏమైనా ప్రతిపక్ష నేత ప్రజల మధ్య యాత్ర చేస్తారనే అభిప్రాయమే బలంగా వుంది.