ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర చేయబోతున్నారని ఎప్పుడో ప్రకటించారు. ఏర్పాట్లు జరిగిపోతున్నాయి, అన్న వస్తున్నాడంటూ హడావుడి మొదలుపెట్టారు, ఆయన యాత్ర ఏ జిల్లాలోకి ప్రవేశిస్తే.. ఆ జిల్లాలో వైకాపా నేతలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో ఖరారు చేసేశారన్నారు, పాదయాత్ర జరుగుతున్న ఈ ఆర్నెల్లూ అన్ని జిల్లాల్లోనూ నియోజక వర్గాల్లోనూ పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇదంతా చూస్తుంటే పక్కా వ్యూహంతోనే ఉన్నారని అనిపిస్తుంది. కానీ, జగన్ పాదయాత్ర తేదీ విషయమై మొదట్నుంచీ గందరగోళ పరిస్థితే నెలకొంటూ వచ్చింది. తేదీలను ఎంచుకునే ముందు కనీస జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ముందేమో, అక్టోబర్ 27 నుంచి అని హడావుడిగా ప్రకటించేశారు. ఆరోజునే అన్న వస్తున్నాడు అంటూ ఆర్భాటంగా చెప్పేశారు. సరిగ్గా, ఆ 27వ తేదీ శుక్రవారం వస్తోందన్న సంగతి తీరిగ్గా తరువాత చూసుకున్నట్టున్నారు! తూచ్.. 27 కాదు, ఆరోజు గ్రహబలం బాలేదూ, ముహూర్త బలం సరిగా లేదంటూ ఏవో కారణాలు చెప్పారు. నవంబర్ 2 అంటూ కొత్త ముహూర్తం పెట్టుకున్నారు. ఇప్పుడు అది కూడా మారిపోయే పరిస్థితి వచ్చింది. అన్న వచ్చేది 2 నుంచి కాదు.. నవంబర్ 6 అంటూ ఇప్పుడు వైకాపా నేతలు చెబుతున్నారు.
జగన్ పాదయాత్ర నవంబర్ 6 న ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ పత్రికలోనే కథనం వచ్చింది. ఇంతకీ.. 2 నుంచి తేదీ 6కి ఎందుకు మారిందంటే… రెండో తేదీ గురువారం వస్తోందట. ఆ మార్నాడే, అంటే శుక్రవారమే జగన్ కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. భారీ ఎత్తున పాదయాత్ర ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున హడావుడి చేసి.. ఆ మర్నాడే జగన్ కోర్టుకు వెళ్లడం కోసమే యాత్రకు బ్రేక్ ఇస్తే బాగోదు కదా! అలా కాకుండా, యాత్ర ప్రారంభించాక కనీసం ఓ మూడు రోజులైనా వరుసగా జనంలో జగన్ ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మార్పు చేయబోతున్నట్టుగా వైకాపా నేతలు చెబుతున్నారు. అందుకే, తేదీ విషయంలో ఈ స్వల్ప మార్పు ఉంటుందని వివరించుకొస్తున్నారు.
సరే… 2వ తేదీ గురువారం వస్తుందనీ, ఆ మర్నాడు వచ్చేది శుక్రవారం అనే విషయం నిన్నటి వరకూ తెలీదా..? విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కుదరదనీ, ప్రతీ శుక్రవారం హాజరు కావాలని చెబితే తప్ప… గురువారం తరువాత శుక్రవారం వస్తుందనేది అర్థం కాలేదా..? అంటే, కోర్టు మినహాయింపు ఇచ్చేస్తుందన్న అతి విశ్వాసంతోనే రెండో తేదీ పాదయాత్ర ప్రారంభానికి ముహూర్తం పెట్టుకున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ‘జగన్ పిటీషన్ ను కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటి’.. అనే ప్రాథమికమైన ఆలోచన కూడా లేకుండా పాదయాత్ర తేదీని ఖరారు చేసేసినట్టుగా భావించాలి. వారానికోసారి జగన్ పాదయాత్రకు బ్రేక్ రావడం సంగతి కాసేపు పక్కన పెడితే… ప్రారంభ తేదీల విషయంలో ఇంత గందరగోళం నెలకొంటోంది. తేదీల విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారూ అనే చర్చ పార్టీ కింది స్థాయి వర్గాలకు వేరే సంకేతాలు పంపే ఆస్కారం ఉంటుంది కదా!