ప్రపంచంలో మిగతా దేశాలన్నింటికీ నవంబరు 8వ తేదీ ఓ సాధారణమైన రోజు కావచ్చు కానీ…. మన భారతీయులకు ఎంత మాత్రం కాదు. ఆ రోజు… దేశ చరిత్రలోనే ప్రజానీకాన్ని, వారి రోజువారీ జీవనాన్ని అత్యంత ప్రభావితం చేసిన నిర్ణయం వెలువడిన రోజు. నోట్ల రద్దు గురించి ఇలా ఎంతైనా చెప్పొచ్చు. అలాంటి నోట్ల రద్దుకి సంవత్సరీకం జరుగనుంది. వచ్చే నవంబరు 8కి నోట్టరద్దు జరిగి ఏడాది. అంటే డీ మానిటైజేషన్… ఫస్ట్ బర్త్ డే అన్నమాట.
దీంతో మరోసారి విపక్షం పాత విమర్శలకు పదను పెట్టింది. నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఒరిగిందేమీ లేదని సిపిఎం జాతీయ నేత సీతారాం ఏచూరి విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు జేసిన నిర్ణయం అదన్నారు. దీని వల్ల రైతులు, ఉపాధి హామీ కూలీలు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రజలను అనేక రకాలుగా కష్టపెట్టిన ఈ నోట్లరద్దు బడాబాబులకు మాత్రం కించిత్తు ఇబ్బంది కూడా కలిగించలేదని, పైగా నల్లధనం మొత్తం తెల్లధనంగా మార్చుకునేందకు చక్కని అవకాశం ఏర్పరచిందంటూ ఎద్దేవా చేశారు. ఈ నేపధ్యంలో రానున్న నవంబరు 8న విపక్షాలు అన్నీ ఏకమై నిరసన దినంగా పాటిస్తాయని ఆయన ప్రకటించారు.
ఇలా విపక్షం ఒకవైపు తిట్టిపోస్తూంటే… కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ మరోసారి తమ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. నల్లధనంపై పోరాడేందుకే నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేశామని చెప్పారు. అందుకే తాము నవంబరు 8ని నల్లధనం వ్యతిరేక దినంగా పాటిస్తామన్నారు.
విపక్షాలు చేపడుతున్న వ్యతిరేక ప్రచారానికి కౌంటర్‌గా దీన్ని అనుకోవచ్చునేమో గాని… ఓ రకంగా చూస్తే కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. ఏడాది క్రితం బ్లాక్ మనీ గాళ్ల భరతం పట్టడానికే పెద్ద నోట్ల రద్దు చేశామంటూ జనాన్ని ఆశల్లో ముంచారు. బ్యాంకుల ముందు పడిగాపులు పడేలా చేశారు. చిన్నా, పెద్దా, ముసలీ, ముతకా అని తేడా లేకుండా రూపాయి కోసం అల్లాడేలా చేశారు. .క్యూలైన్లు కొన్ని ప్రాణాలు సైతం బలిగొన్న ఉదంతాలకు కారణమయ్యారు.
ఇప్పటిదాకా ఆ నోట్లరద్దు ఆశించిన ఫలితాలు ఇచ్చిందంటూ అనడమే గాని, అవేమిటో చెప్పిన పాపాన పోలేదు. ఒక్కడంటే ఒక్క పెద్ద బ్లాక్‌మనీ దారుడ్ని కూడా పట్టి చూపింది లేదు. పైగా రద్దయిన నోట్లన్నీ భధ్రంగా తిరిగి బ్యాంకులకు వచ్చేశాయి. .సరే… పనుల్లో పడి మన జనం ఎంత కష్టమైనా మరచిపోతారు కాబట్టి… మీ నిర్ణయం తాలూకు లాభనష్టాల గురించి ప్రశ్నించడం లేదు. అయితే మీరు ఇప్పుడు మళ్లీ నల్లధన వ్యతిరేక దినం పాటించమంటూ పిలుపిస్తున్నారు. అంటే నోట్లరద్దు అనే మీ ప్రయోగం విఫలమైందని అంగీకరిస్తున్నట్టేనా? ప్రభుత్వం నల్లధనం వెలికి తీయడానికి అంటూ చేపట్టిన నోట్లరద్దు కి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆ నిర్ణయం వల్ల దేశానికి కలిగిన లాభనష్టాలను నిజాయితీగా సమీక్షించుకోవడం, వాటిని ప్రజలకు తెలియజెప్పడం జరగాలి. అంతే తప్ప తిరిగి నల్లధన వ్యతిరేక దినం జరుపుతామంటే…కామెడీగా లేదూ..