అనుకున్నట్టుగానే జరుగుతోంది. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విదేశాల నుంచీ వచ్చేలోగానే రేవంత్ రెడ్డిపై చర్యలు ఉంటాయని అనుకున్నారు. టీడీఎల్పీ సమావేశం నిర్వహించే అధికారం రేవంత్ కి లేదంటూ పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ చెప్పడం గమనార్హం. దీంతోపాటు పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదా నుంచి కూడా రేవంత్ ను తప్పించినట్టే. ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత.. ఈ రెండు హోదాల్లో రేవంత్ రెడ్డి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదనేది చంద్రబాబు ఆదేశంగా ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ అభివృద్ధి కోసం సొంత నిర్ణయాలు తీసుకుని క్రియాశీలంగా వ్యవహరించాలంటూ రమణను చంద్రబాబు ప్రోత్సహించినట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనా, రేవంత్ రెడ్డి వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది. అయితే, ఇప్పుడు రేవంత్ ఏం చేయబోతున్నారనేది మాత్రం ఇంకా ఉత్కంఠగానే ఉంది. ఎందుకంటే, చంద్రబాబు నాయుడు వచ్చిన తరువాత ఆయనతో ఓసారి భేటీ అయిన తరువాతే తాను మాట్లాడతాను అంటూ ఇప్పటికీ రేవంత్ చెబుతున్నారు.
నిజానికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ దొరుకుతుందా అనే సందేహం కూడా ఉంది. ఏదేమైనా, తాను చెప్పాలనుకున్నది రేవంత్ ఏదో ఒక విధంగా చంద్రబాబుకు చెప్తారని తెలుస్తోంది. తాను తెలుగుదేశం పార్టీకి దూరం కావడానికి దారి తీసిన పరిస్థితులను, ఇతర నేతలు తనతో వ్యవహరించిన తీరును చంద్రబాబుకు వివరించాలనేది ఆయన వ్యూహంగా ఉంది. అంతేకాదు, ఇదే సమయంలో చంద్రబాబు నాయుడుపై ఎలాంటి విమర్శలూ చేయకూడదని రేవంత్ భావిస్తున్నారట. పార్టీలో గుర్తింపు ఇచ్చి, అవకాశాలు కల్పించినందుకు హుందాగానే ధన్యవాదాలు తెలపాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో… ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెరాసతో టచ్ లో ఉంటున్న కొంతమంది నాయకుల పేర్లను రేవంత్ రెడ్డి బయటపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. తనపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలందరికీ పేరుపేరునా కౌంటర్ ఇచ్చేందుకు ప్రిపేపర్ అవుతున్నారట!
ఒకవేళ చంద్రబాబు అపాయింట్మెంట్ ఇస్తే… ఆయనకు ఈ వివరాలన్నీ చెప్పనున్నారనీ, లేదంటే ఓ భారీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, మీడియా ముఖంగా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆయన ఫిరాయింపుల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాబట్టి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకనే పార్టీ మార్పు ఉంటుందని చెబుతున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్న ప్రకటనకు ఇంకాస్త సమయం ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ముందుగా, తాను టీడీపీకి ఎందుకు దూరం కావాల్సి వస్తోందో… దానికి దారి తీసిన పరిస్థితులు ఏంటో అనేది మాత్రమే ప్రజల్లోకి తీవ్రంగా వెళ్లేలా వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది.