అదిగో ఇదిగో అంటూ వాయిదాలు పడుతూ వస్తున్న వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్షనేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఎట్టకేలకు ఖరారైంది. వారానికోసారి కోర్టుకు హాజరయ్యే అవసరం, అసెంబ్లీ సమావేశాలు… వంటి బాలారిష్టాలతో రెండు సార్లు వాయిదా పడి ముచ్చటగా మూడోసారి ఖరారైంది. ఈ యాత్రకు ప్రజాసంకల్ప యాత్రగా పేరు పెట్టారు. నవంబరు 6 నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని వైసీపీ వర్గాలు గురువారం స్పష్టంగా ప్రకటించాయి.
ఈ యాత్ర ఇడుపుల పాయలో ప్రారంభమై ఇఛ్చాపురంలో ముగియనుంది. మొత్తం 180 రోజుల పాటు 3వేల కి.మీ నడక కొనసాగనుంది. ఇందులో కనీసం 45లక్షల కుటుంబాలను కలవాలని, 20వేల మంది కార్యకర్తలతో ముఖాముఖి జరపాలని నిర్ణయించారు. దారి పొడవునా 5వేల చిన్న చిన్న భేటీలు ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రజాసంఘాలతో 180కిపైగా సమావేశాలు, 125 భారీ బహిరంగ సభలు ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. 13 జిల్లాల వ్యాప్తంగా ఉన్న 125 నియోజకవర్గాలను చుట్టే లక్ష్యంతో సాగే ఈ యాత్రలో 50వేల గ్రామాలను సందర్శించనున్నారు విపక్ష నేత.
వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునే లక్ష్యంతో ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైసీపీ… అధినేత యాత్రకు ఎటువంటి ఆటంకాలు రాకుండా యాత్ర విజయవంతానికి కృషి చేయనుంది. దీనిలో భాగంగానే నవంబరులో జరిగే అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. రాజకీయ విశ్లేషకులు, పండితులు సరైనది కాదంటున్నా వినకుండా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్న వైసీపీ… దీనికి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడాన్ని సాకుగా చూపుతోంది. అంతేకాదు. ఈ విషయంలో తమకు ఎన్టీయార్ ఆదర్శం అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఏదేమైనా… యాత్ర విజయానికి సర్వశక్తులూ ఒడ్డుతున్న వైసీపీ… లక్ష్యసాధనలో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.