టిఆర్ఎస్ఎల్పి సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి ఆ పార్టీ అధినేత కెసిఆర్ మరోసారి వచ్చే ఎన్నికల సీట్ల లెక్కలు చెప్పారు. తమకు 96 నుంచి 105 వరకూ వస్తాయని ఆయన చెప్పారట. ఘనమైన ఈ సంఖ్యలు అప్పుడప్పుడూ మారుతున్నాయంటే అది సర్వేల సమయం కారణంగానో లేక యథాలాపంగా చెప్పడం వల్లనో తెలియదు. ఏమైనా వీటిని పదేపదే చెప్పడం ద్వారా ఆయన తామే మొత్తం తుడిచిపెట్టబోతున్నామనే సంకేతాలు కొనసాగిస్తున్నారు. మరోవైపున ఎంఎల్ఎను హెచ్చరించే ధోరణి మార్చుకుని 99 శాతం మంది సిట్టింగ్‌లకు సీట్లు వస్తాయంటున్నారు. సరిగ్గా పనిచేయని వారి వివరాలు గతంలో తానే ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఇలా అంటున్నారంటే ఎవరినీ వదులుకోవడానికి లేదా ముందే దూరం చేసుకోవడానికి సిద్దంగా లేరన్నమాట. అయితే నిజంగా వున్నవారందరినీ ఇస్తే కొందరు అనివార్యంగా దూరమవుతారు. ఎందుకంటే వున్న ఎంఎల్‌ఎలలో దాదాపు మూడోవంతు బయిటనుంచి వచ్చారు. వారి స్థానాల్లో పాత టిఆర్ఎస్ అభ్యర్థులున్నారు. గతంలో టికెట్ రాక 2019పై ఆశపెట్టుకున్నవారూ వున్నారు. అలాటప్పుడు వున్నవారే కొనసాగుతారంటే వారు భరించడం కష్టం. వారిలో కొందరైనా పార్టీ మారడం అనివార్యమవుతుంది.
మరోవైపున ఎంఎల్ఎలను ఎంతగా హెచ్చరిస్తున్నా పరస్పర కీచులాటలు మానడం లేదు. మాజీ మంత్రి సురేఖ ఎర్రబెల్లి కుటుంబంపై బాంబులు పేల్చడం ఇందుకు తాజా ఉదాహరణ.
మరోవైపున తెలంగాణ ప్రథమ కుటుంబం నుంచి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంతోష్‌కు కెసిఆర్ పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి చాలాకాలంగా కెసిఆర్ అనుసంధానం ఆయనే చూస్తున్నా ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి హౌదాలో అధికారికంగా చేస్తారన్నమాట. కెసిఆర్‌ను పెదనాన్నా అని పిలిచే సంతోష్ బొమ్మ అప్పుడే గులాబీ అడ్వర్టయిజ్మెంట్లలో కవిత హరిష్ల పక్కన చోటు సంపాదించింది. కెటిఆర్ నాన్న పక్కన వున్న పెద్ద యాడ్ ఈ రోజు నమస్తేలో మొదటిపేజీ నింపేసింది.