ప్రతిపక్ష నేత జగన్ చేపట్టబోతున్న పాదయాత్రకు ప్రజా సంకల్ప యాత్ర అని నామకరణం చేశారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి యాత్ర ప్రారంభం అవుతుందనీ, ప్రతీ శుక్రవారం ఆయన విచారణ నిమిత్తం కోర్టుకు హాజరౌతారని పార్టీ ప్రకటించింది. పాదయాత్రలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. జిల్లాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చించారు. ఆ తరువాత, రాబోయే అసెంబ్లీ సమావేశాలను కూడా బహిష్కరిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ సమావేశాలకు ప్రతిపక్షం హాజరు కావడం లేదని కూడా ప్రకటించారు. అంతేకాదు, జగన్ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారని తెలిసే, సమయం చూసుకుని అసెంబ్లీ సమావేశాలను అధికార పార్టీ ఏర్పాటు చేసిందంటూ పలువురు వైకాపా నేతలు విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్షం బహిష్కరించడంపై ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీని ఎదుర్కొనేందుకు ధైర్యం లేకనే కుంటి సాకులు చెబుతున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారనీ, ఉపాధి హామీ కూలీల డబ్బులను అడ్డుకునేందుకు కూడా లేఖలు రాశారు అన్నారు. వీటిపై మాట్లాడేందుకు వారి దగ్గర సరైన వాదన లేదన్నారు. వారి డెప్యూటీ నాయకుడి మీద, ఇతర ఎమ్మెల్యేల మీద జగన్ కు నమ్మకం లేదని మంత్రి విమర్శించారు. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి నిలదీయాల్సింది పోయి, కుంటి సాకులతో పారిపోతున్నారన్నారు. ప్రజా సమస్యల దృష్ట్యా పాదయాత్రను మరో పదిరోజులు వాయిదా వేసుకోవడం పెద్ద సమస్య అవుతుందా అంటూ మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇదే అంశమై వైకాపా తీరును తప్పబట్టింది. సమస్యలపై పోరాటం చేయాలంటే అసెంబ్లీలో మాట్లాడాలనీ, అంతేగానీ… జనంలోకి పారిపోతే సమస్యలు తీరుతాయా అంటే ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు.
జగన్ పాదయాత్ర తేదీని రెండుసార్లు మార్చుకున్నారు కదా. అసెంబ్లీ సమావేశాల తరువాత యాత్ర ప్రారంభించినా పెద్దగా సమస్య లేదు. సమావేశాల బహిష్కరణకు ‘ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోకపోవడం’ అని ఇప్పుడు వైకాపా చెబుతూ ఉండటం కచ్చితంగా కుంటి సాకే అనాలి. ఎందుకంటే, జంప్ జిలానీల మీద అనర్హత వేటు ఎందుకు వేయడం లేదని ఎప్పుడైనా పోరాటం చెయ్యొచ్చు! ఇదే సాకుతో గత సమావేశాలను కూడా బహిష్కరించొచ్చు కదా, ఆ పని చెయ్యలేదే. వాస్తవం మాట్లాడుకుంటే… జగన్ యాత్రకు బయలుదేరితే నేతలు అందరూ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి, ఎమ్మెల్యేల గైర్హాజరీకి కూడా ఓ పోరాటం కలర్ ఇచ్చే ప్రయత్నమే ఇది. పైగా, అసెంబ్లీలో జగన్ ఒక్కరిదే వాయిస్. తరువాత స్థాయి నాయకులెవ్వరూ పెద్దగా మాట్లాడిన చరిత్ర గత సమావేశాల్లో లేదు. పోనీ, జగన్ లేకుండా పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశాలను నెట్టుకుని రాగలరా అంటే… ఆ నమ్మకం జగన్ కే ఉన్నట్టు లేదనేది కూడా కొంత వాస్తవమే.