వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, భాజపాల మధ్య దోస్తీ ఉంటుందా.. అనే అనుమానం ఈ మధ్య వ్యక్తమౌతూ ఉండేది. భాజపాతో పొత్తు వద్దు, ఒంటరిగానే ముందుకు సాగుదాం అంటూ టీ టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు అధినేత చంద్రబాబు నాయుడు వద్ద మొరపెట్టుకోవడం అనేది ఒక రొటీన్ ప్రాసెస్ గా ఉండేది. ఆయన హైదరాబాద్ కి వచ్చినప్పుడు, వీళ్లు అమరావతికి వెళ్లినప్పుడు ఇదే ప్రధాన చర్చనీయాంశంగా నిలిచేది. ‘కొన్నాళ్లు ఆగండీ, అమిత్ షాతో మాట్లాడాలీ, తొందరపడి విమర్శలు చేయకండీ’ అంటూ చంద్రబాబు అనునయింపు వ్యాఖ్యలు కూడా అంతే రొటీన్ గా వ్యవహారంగా ఉండేవి. ఇక, భాజపా నేతలు అయితే ఒక అడుగు ముందుకేసి.. తెలంగాణలో తెలుగుదేశం ఉందా అని ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ ఒక ఒరలో ఇమడటం కష్టమేమో అనే వాతావరణం కనిపించేది. అయితే, అదంతా నిన్నమొన్నటి మాటలానే అనిపిస్తోంది. ఇప్పుడు ఒకేసారి పరిస్థితి మారిపోయింది. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో టీడీపీ, భాజపాలు ఒకటైనట్టు కనిపిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భాజపా, టీడీపీ నేతలు సమావేశమయ్యారు. సభలో కలిసికట్టుగా వ్యవహరిస్తూ కేసీఆర్ సర్కారును సమర్థంగా నిలదీయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. భాజపా, టీడీపీ నేతలు ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి రాలేదు. తరువాత, కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బాధ్యతాయుతమైన పార్టీలుగా రెండు పార్టీల నేతలూ కలిసి పనిచేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. మరింత సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. మొత్తానికి, రెండుపార్టీలూ కలిసికట్టుగా ముందుకు సాగేందుకు కావాల్సిన పునాదులు మళ్లీ పడ్డట్టుగానే కనిపిస్తోంది.
అయితే, ఇదే అంశమై రేవంత్ రెడ్డి మీడియా మిత్రుల దగ్గర ప్రస్థావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారట! టీడీపీ నేతలంతా కలిసి చంద్రబాబు వచ్చేలోపు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారన్నారు. టీడీపీపై విమర్శలు చేసిన భాజపాతో అనూహ్యంగా సమావేశం ఎలా పెట్టారంటూ రేవంత్ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ రెండు పార్టీలను ఉన్నట్టుండి దగ్గర చేసిన ఆ అదృశ్య శక్తి ఎవరూ అంటూ రేవంత్ విస్మయం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ కేసీఆర్ నెత్తిన పాలు పోసేట్టుగా మారుతున్నాయంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో భాజపా టీడీపీల మధ్య పొత్తుల విషయమై ఒక క్లారిటీ వచ్చినట్టుగానే కనిపిస్తోంది! ఏదైతేనేం, చంద్రబాబు నాయుడుకి ఒక సమస్య అయితే తీరిందనే చెప్పుకోవచ్చు. అదీ, రేవంత్ రెడ్డి నిష్క్రమణ పర్వం నేపథ్యంలో జరగడం విశేషం!