తెలుగులో ఓ సామెత ఉంది అడుసు తొక్కనేల కాళ్లు కడగనేల అని… అలాగే ఉంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ వైఖరి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక పెద్ద సంఖ్యలో పిల్లలు చనిపోయిన లాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన ఈ సిఎం గారు… అంతకు మించి పనేమీ లేదన్నట్టు తాజ్‌మహల్ లాంటి ప్రతిష్టాత్మక కట్టడం విలువను దిగజార్చబోయి కంగుతిన్నారు. చివరకు రోడ్లు ఊడ్చి శుభ్రపడే ప్రయత్నం చేశారు.
ఇటీవల ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక పరంగా అభివృధ్ధి పరచాల్సిన జాబితాతో బుక్లెట్ ప్రచురించి అందులో భారతదేశపు గొప్ప నిర్మాణమైన ఆగ్రాలోని తాజ్‌మహల్ కు చోటు కల్పించకపోవడం వివాదాస్పదమైంది. అయితే ఈ విషయంపై ఏ మాత్రం వెనక్కు తగ్గని ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎంపి కూడా తాజ్‌మహల్‌పై ఇష్టారాజ్యంగా మాటల దాడులు చేశారు. అదొక సమాధి తప్ప ప్రేమకు చిహ్నం కాదన్నారు. అసలు ఒకప్పుడు అక్కడ శివాలయం ఉండేదని దాన్ని కూల్చి ఈ సమాధిని నిర్మించారన్నారు. ముఖ్యమంత్రి గారేమో.. విదేశీ ప్రముఖులు భారత పర్యటనకు వచ్చినప్పుడు ఇవ్వాల్సింది తాజ్ నమూనాలు కాదని, భగవద్గీత పుస్తకం అనీ సెలవిచ్చారు.
అయితే దీనిపై ఇంటా బయటా విమర్శలు చెలరేగాయి. భాజాపా ప్రభుత్వం మతభావాలను రెచ్చగొడుతోందని, మత ఛాందస భారతాన్ని నిర్మించాలని చూస్తోందంటూ చేసే ఆరోపణలకు ఇది బలం చేకూర్చేలా ఉందంటూ భాజాపాలో మితవాదులు ఆందోళన చెందారు. వీటన్నింటి నేపధ్యంలో యుపి ముఖ్యమంత్రి నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. తన మందీ మార్బలంతో కలిసి గురువారం తాజ్‌మహల్‌ని సందర్శించారు. చాలాసేపు అక్కడ గడిపారు. అంతేకాదు స్వఛ్చభారత్ లో భాగంగా తాజ్ పరిసరాలను ఊడ్చేశారు. తిరిగి వెళుతూ తాజ్ ఒక అద్భుతమని కితాబిచ్చారు. ఇది ఎవరు కట్టినా అందులో వేలాది మంది భారతీయుల శ్రమ దాగి ఉందన్నారు. తమ పర్యాటక ప్రాంతాల పరిరక్షణ కార్యక్రమంలో తాజ్‌కు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. తాజ్ బయట విదేశీయులతో కలిసి ముచ్చట్లు సాగించి ఫొటోలకు ఫోజిచ్చారు.
ఆయన పర్యటనలో దాదాపు 500 మంది వరకూ భాజాపా నేతలు, పర్యాటక మంత్రి, ఆర్కియాలజీ శాఖ అధికారులు… ఉన్నారు. ఏకంగా 14వేల మంది పోలీసులను ఆయన భధ్రత కోసం ఉపయోగించారు. మొత్తం మీద ఆయన పర్యటనకు తగ్గ ప్రచారమే లభించింది. అయితే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ వర్యులు… ఇకనైనా లేనిపోని వివాదాలను రేకెత్తించే అంశాల జోలికి వెళ్లే బదులు… ఎంతో నమ్మకంతో తమను పెద్ద మెజారిటీతో పీఠమెక్కించిన ప్రజల కోసం తన సమయాన్ని సద్వినియోగం చేస్తే… మేలేమో…