తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5
ప్రేమ – స్నేహం – జీవితం…
ఇవి మూడూ మూడు మహా సముద్రాలు. కలిస్తే మహా సముద్రమే అవుతుంది. ఒడ్డున కూర్చుని చూస్తే సముద్రం ఒకలా అనిపిస్తుంది. అల తాకితే మరోలా అనిపిస్తుంది. ఆ నీటిలో దిగితే మరోలా ఉంటుంది. అందులో ప్రయాణం చేస్తే… వీటికి మించినదేదో తెలుస్తుంది. దేని గురించి ఎంత చెప్పినా – ఇంకా ఆకాశమంత మిగిలిపోయే ఉంటుంది.
అందుకే సినిమా వాళ్లకు వీటినుంచి కథలు పుట్టించడం తేలిక అవుతుంది. ఎవరి దృక్పథం నుంచి, ఎవరి దృష్టి కోణం నుంచి వాళ్లు… తమ తమ నిర్వచనాల్ని ఇస్తుంటారు. ఇందులో స్నేహం ఉంది చూశారూ.. దాని మత్తు, మహత్తు మరో లెవిల్లో ఉంటుంది. ‘టచ్’ చేసే సీన్లు రాసుకోవాలే గానీ – థియేటర్లో చూసిన సినిమా ఇంటికెళ్లాక కూడా మళ్లీ మళ్లీ గుర్తొస్తుంటుంది. అందుకే ఈ సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్. కాకపోతే ఈమధ్య కాలంలో ఎవరూ స్నేహం గురించి చెప్పే ప్రయత్నం చేయలేదు. ఆ బ్రేక్‌ని – కిషోర్ తిరుమల బాగా వాడుకొన్నాడు. ‘ఉన్నది ఒకటే జిందగీ’లో కిషోర్ ఎంచుకొన్న పాయింట్ స్నేహం. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తే అనే కథ ఎప్పుడో చూశాం. ఇలాంటి కథలలో ప్రేమ దేశం ఓ మైల్ స్టోన్. ప్రేమదేశం కథనే మరో కోణంలో చెబితే – అదే `ఉన్నది ఒకటే జిందగీ`. అదెలాగంటే….
* కథ
అభిరామ్ (శ్రీరామ్) స్నేహానికి ప్రాణం ఇస్తుంటాడు. వాసు (శ్రీవిష్ణు) అనే ఫ్రెండ్ ఉంటాడు. చిన్నప్పటి నుంచీ ఒకరంటే ఒకరికి ప్రాణం. అతని జోలికి ఎవరొచ్చినా ఊరుకోడు. అభి.. మహా (అనుపమ పరమేశ్వరన్) అనే డాక్టర్‌తో ప్రేమలో పడతాడు. వాసు కూడా మహానే ప్రేమిస్తాడు. తమ స్నేహంలో ఓ అమ్మాయి వల్ల క్లాష్ రాకూడదన్న ఉద్దేశంతో ఇద్దరూ ఒకేసారి మహాకి ప్రపోజ్ చేస్తారు. `మాలో ఎవర్ని ఇష్టపడినా మిగిలిన వాళ్లకు ఒకేనే..` అని చెబుతారు. ఇద్దరిలో వాసు ప్రేమనే ఒప్పుకొంటుంది మహా! మహా ప్రేమలో మునిగిపోయిన వాసు… అభిని నిర్లక్ష్యం చేస్తుంటాడు. అది తట్టుకోలేని అభి… వాసు, మహాలకు దూరం అవుతాడు. ఐదేళ్ల తరవాత అభి- వాసు మళ్లీ కలుస్తారు. వీరిద్దరి మధ్య మేగీ (లావణ్య త్రిపాఠీ) అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. ఈ స్నేహితులు మళ్లీ ఎలా కలిశారు? మహా ఏమైంది? మేగీని ఈసారి ఎవరు ప్రేమించారు? అనేది తెరపై చూడాలి.
* విశ్లేషణ
ప్రేమ దేశం గుర్తింది కదా? అందులో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ప్రేమలో పడడం వల్ల.. ఇద్దరూ శత్రువులుగా మారతారు. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్ – ప్రేమ కంటే స్నేహం గొప్పదని నమ్మే ఇద్దరు స్నేహితుల కథ ఇది.
ప్రతి ఫ్రేమ్‌లోనూ, ప్రతీ సన్నివేశంలోనూ ఫ్రెండ్ షిప్‌నే ఎలివేట్ చేశాడు దర్శకుడు. దాంతో.. ప్రేమ దేశం కథని కొత్త కోణంలో చూసినట్టు అనిపించింది. యాక్షన్, ఫన్ కంటే ఎమోషన్ పండించడం చాలా కష్టం. దర్శకుడిలో దమ్మున్నప్పుడు, అతనిలో ఓ మంచి రచయిత ఉన్నప్పుడే అది వర్కవుట్ అవుతుంది. నేను శైలజతో లవ్‌లో ఎమోషన్ని చక్కగా చూపించిన కిషోర్ తిరుమల… ఈసారి ఫ్రెండ్ షిప్లో ఎమోషన్స్‌ని ఓ రేంజ్లో ఆవిష్కరించాడు.
ఇలాంటి సినిమాలకు బలం.. స్క్రిప్టే. కథ, కథనం, సంభాషణలు సరిగా రాసుకొంటే వర్కవుట్ అవుతుంది. కిషోర్ తిరుమల అదే చేశాడు. తనలో రచయిత దర్శకుడికి బాగా సహకరించడంతో… కిషోర్ పని నల్లేరుపై నడకలా సాగింది. కథలోకి వెళ్లడానికి కాస్త సమయం తీసుకొన్నా.. యువతరానికి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు రాసుకోవడంతో పాటు ఫ్రెష్ ఫీల్ తీసుకురావడంతో ప్రేక్షకుడు తొందరగానే సినిమాలో లీనమయ్యాడు. విశ్రాంతి ముందొచ్చే సన్నివేశాలు మనసును హత్తుకొంటాయి. దర్శకుడు కథలోంచి ఎక్కడా బయటకు రాకుండా.. వీలైనంత వరకూ ఆ గీతను పట్టుకొనే నడిపించడానికి ప్రయత్నించాడు. మధ్యమధ్యలో సిట్యువేషన్ కామెడీ సృష్టించి రిలీఫ్ కలిగించాడు. ఫ్రెండిష్ గురించి కిషోర్ రాసుకొన్న ప్రతీ సన్నివేశం నిలబడింది. వాసు ప్రేమని నిలబెట్టడానికి అభిరామ్ ఏం చేశాడో తెలిసే సందర్భంలో ఫ్రెండ్ షిప్‌పై మరింత గౌరవం పెరుగుతుంది. ఇలాంటి ఫ్రెండ్ నాక్కూడా ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది.
సాధారణంగా ఇలాంటి సినిమాలకు ఒకే బాధ. ‘స్లో నేరేషన్’. సినిమా బాగా స్లోగా ఉంది అనిపించొచ్చు. కానీ.. ప్రతీ సినిమా… ఫాస్ట్ ఫార్వర్డ్లోనే చూడాలనుకోవడం మన తప్పు. నదిపై పడవ ప్రయాణం ఒకలా ఉంటుంది. బోటు ప్రయాణం మరోలా ఉంటుంది. హాయిగా సాగిపోయే సన్నివేశాలు, మధ్యమధ్యలో మెలిపెట్టే సందర్భాలు, మన నిజ జీవితంతో పోలిక చూసుకొనే సంఘటనలు కావాలనుకొనేవారికి ఉన్నది ఒకటే జిందగీ బాగా నచ్చుతుంది.
* నటీనటుల ప్రతిభ
ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకొన్న రామ్… ఆ జోరు కాస్త తగ్గించి `నేను శైలజ` చేశాడు. ఆ సినిమాతో, ఆ పాత్రతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అభిరామ్ పాత్ర కూడా అంతే. ఒక విధంగా రామ్ కెరీర్లో ఇదే బెస్ట్ పెర్‌ఫార్మ్సెన్స్ అని చెప్పినా తప్పేం కాదు. గెడ్డం గెటప్‌లో ఎలా ఉంటాడో అనుకొంటే… అందులోనే బాగున్నాడు. తన పాత్రకు ఆ లుక్ సరిగ్గా సరిపోయింది. అనుపమ పరమేశ్వరన్ పాత్ర కూడా చాలా కాలం గుర్తుండిపోతుంది. తనెంత మంచి నటో ఈ సినిమాతో మరోసారి తెలిసింది. లావణ్య ఒక్కటే మిస్ కాస్టింగ్ అనిపిస్తుంది. శ్రీవిష్ణు అయితే.. మరో హీరో! అతని క్యారెక్టర్ని దర్శకుడు ఎంత బాగా డిజైన్ చేశాడో, శ్రీవిష్ణు అంతకంటే బాగా ఇమిడిపోయాడు. ఫ్రెండ్స్ బ్యాచ్‌లో అందరూ తమ వంతు న్యాయం చేశారు.
* సాంకేతి వర్గం
దేవిశ్రీ పాటలు ఒకే అనిపిస్తాయి. వాటమ్మా పాట కూడా అంత కిక్ ఇవ్వలేదు. కానీ.. నేపథ్య సంగీతంతో మాత్రం ప్రాణం పోశాడు. చాలా సన్నివేశాలు దేవి వల్ల మరింత ఎలివేట్ అయ్యాయి. డైలాగ్ రైటర్‌గా తిరుమల మరోసారి ఆకట్టుకొన్నాడు. లింక్ డైలాగులు.. బాగా రాసుకొన్నాడు. ఓ డైలాగ్‌ని మరో సందర్భంలో గుర్తు చేసే సీన్లు ఇందులో ఉన్నాయి. అలాంటి చోట్ల తప్పకుండా క్లాప్స్ పడతాయి. ‘కలవడానికి రమ్మాన్నావనుకొన్నా కలపడానికి అనుకోలేదు’ లాంటి డైలాగులు చిన్నవే. కానీ డెప్త్ మాత్రం ఓ రేంజులో ఉంటుంది. కెమెరా పనితనం, నిర్మాణ విలువలు… దేనికీ వంక పెట్టే అవసరం ఉండదు.
* ఫైనల్ టచ్ : హిట్టమ్మా… హిట్టు కొట్టేశాడమ్మా!
తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5