తెలంగాణ నాయకుడు రేవంత్‌రెడ్డి బహిరంగంగా తిరుగుబాటు చేసి పార్టీని విమర్శించినా,కాంగ్రెస్ నేతలను ఆలింగనం చేసుకున్నా వెంటనే చర్య తీసుకోవడానికి తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబు నాయుడు సిద్ధం కాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. మరోసారి అమరావతిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ అక్కడకు రావలసిందిగా ఆయన టిటిడిపి నేతలను ఆహ్వానించినట్టు సమాచారం. అమరావతి వెళ్లాక అక్కడ తన సన్నిహితులతో చర్చించవచ్చునేమోగాని టిటిడిపి నేతలతో ఇంకా మాట్లాడేదేముంటుంది? అంటే రేవంత్‌పై వున్న ఫలాన చర్య తీసుకోవడానికి లేదా వ్యాఖ్యానించడానికి చంద్రబాబు సిద్ధంగా లేరన్నమాట. ఎవరూ ఎక్కువగా మాట్లాడవద్దని అందరికీ కలిపి చెప్పడమంటే రేవంత్‌నూ ఇతరులనూ సమానం చేయడమే . ఇలా చెప్పడం లండన్ నుంచి ఫోన్‌చేయడంలో కోపతాపాలు ఎవరిపైన అని గతంలోనే నేను 360లో ప్రశ్న వేశాను. నిజంగా చంద్రబాబు ఏదైనా చెప్పాలన్నా, చేయాలన్నా విదేశీ పర్యటన అడ్డంకి కానేకాదు. ఏదో తెలియని చెప్పలేని సంధిగ్థత ఆయనను వెంటాడుతున్నది. ఓటుకునోటు కేసు అందుకు కారణమని ఎవరైనా అనుకుంటారు. అయితే ఆ కేసులో ఏం చేసినా చెప్పినా ముందు రేవంత్ దెబ్బతింటారు. ఇంకేవైనా ఆధారాలు దొరికితే తప్ప కేవలం ఫోన్ రికార్డింగ్ ఒక్కటే చంద్రబాబుకు చేసే నష్టం వుండదు. ఆ కేసు మాత్రమే గాక మరేవో అంతర్గత సంబంధాలు, తేల్చుకోవలసిన విషయాలు వారి మధ్య వున్నాయి గనక మరోసారి వాయిదా వేశారు. ఇప్పటి వరకూ రేవంత్ రెడ్డి పలచన కాగా ఇప్పుడు చంద్రబాబు తన తడబాటును బయిటపెట్టుకుని కొంత పలచనయ్యారని చెప్పాలి. శాసనసభ 50 రోజులు అంటున్నారు గనక అంతకాలం అనుమతిస్తే ఉభయత్రా పరువు తక్కువే అవుతుంది. చంద్రబాబు సంధిగ్థత ఎలా వున్నా రేవంత్ తన భవిష్యత్ రీత్యా అంతకాలం ఆగకపోవచ్చు.చంద్రబాబుతో మాట్టాడేననే పేరిట ఆయన తదుపరి అడుగు వేసినా వేయొచ్చు. రాజీనామా చేసి బయిటకు వస్తే ఇక ఎవరూ ఏమీ చేయగలిగింది వుందడు. అలాగాక ఆయనే వెళ్లాలని టిడిపి, పార్టీనే గెంటేయాలని ఆయన ఎదురుచూస్తుంటే మాత్రం నిస్పందేహంగా విశ్వసనీయత దెబ్బతినిపోతుంది. ఇలాటి ఉదంతం గతంలో ఎక్కడా జరగలేదు కూడా.