రైతులను తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదనీ, అన్నదాతల అవస్థలను అద్దం పట్టాలన్న ఉద్దేశంతోనే ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని టి. కాంగ్రెస్ చేపట్టింది. ఈ కార్యక్రమానికి రైతులు స్వచ్ఛందంగానే తరలి వస్తున్నారంటూ ఓ వారం రోజుల నుంచీ ఆ పార్టీ నేతలు సందడి చేశారు. రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా హైదరాబాద్ లోని గాంధీ భవన్ నుంచి అసెంబ్లీ వరకూ ర్యాలీగా వెళ్లి, ముట్టడి చేసేందుకు నేతలు బయలుదేరారు. అక్కడి నుంచి రొటీన్ హైడ్రామా మొదలైపోయింది. పోలీసులు రంగంలోకి దిగారు. నేతల్ని అడ్డుకోవడంతో వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో నేతలూ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు, ప్రముఖ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. ముందస్తుగానే చాలామంది కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతుల సమస్యపై కేసీఆర్ సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
ప్రతిపక్ష నాయకుడినీ, ఎమ్మెల్యేలనీ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి, అసెంబ్లీ సమావేశాలు నడుపుకోవడానికి సిగ్గు ఉండాలంటూ ప్రభుత్వంపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేది కాదనీ, శాసన సభతోపాటు మండలి కూడా ఎంతో పద్ధతిగా నడిచేదని ఉత్తమ్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం ఇంతకంటే మంచిగా ఉండేదన్నారు. తెలంగాణ వస్తే పరిస్థితి మరింత స్వేచ్ఛాయుతంగా ఉంటుందని అనుకుంటే, కేసీఆర్ సర్కారు ఆధ్వర్యంలో మరింత అధ్వాన్నంగా తయారైందన్నారు. ఇక, ఛలో అసెంబ్లీ కార్యక్రమంపై అధికార పార్టీ కూడా స్పందించింది. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… రైతు సమస్యలపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు. గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ్ల చూపించిన ఉత్సాహం చూపించి ఉంటే.. రైతుల సమస్యలకు ఎంతో కొంత పరిష్కారం లభించేదని మంత్రి అన్నారు.
ఇంతకీ.. ఛలో అసెంబ్లీ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ ఏం సాధించినట్టు..? ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం, కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేయడం ద్వారా తెరాస ఏం చేసినట్టు..? ఛలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకుంటారని కాంగ్రెస్ నేతలకీ ముందే తెలుసు. పోలీసులు రంగంలోకి దిగుతారనీ, అరెస్టు ఉంటాయనీ, ఆ తరువాత అధికార పార్టీ నేతల విమర్శలు ఉంటాయనీ తెలిసిందే. ఇలాంటి కార్యక్రమాలకు ఇంతకంటే బెటర్ ముగింపు ఉండదు! గత చరిత్ర అదే చెబుతోంది. అయితే, వీటినే రైతుల సమస్యలపై పోరాటాలు అంటారా..? తెరాసను ఎదిరించడం కాంగ్రెస్ లక్ష్యం, కాంగ్రెస్ అడ్డుకోవడం తెరాస ధ్యేయం! ఈ క్రమంలో ‘రైతు సమస్యలు’ అనేది కేవలం ఒక చర్చనీయాంశంగా మాత్రమే మిగిలిపోయింది!