రేవంత్‌రెడ్డి ఉదంతం రాజీనామా లేఖతో చప్పగా ముగిసిపోవడం నిజమే గాని దాని వెనక చాలా కారణాలున్నాయి. అందులో అతి ముఖ్యమైంది ఉభయ ముఖ్యమంత్రులు చంద్రబాబు,కెసిఆర్‌లు తమ వాళ్ల నోళ్లకు తాళాలు వేయడమే. మొదట్లో రేవంత్ ఇరురాష్ట్రాలిటిడిపి నేతలపై తీవ్రంగానే ఆరోపణలు చేశారు. ఇప్పుడు రాసిన ఆఖరి లేఖలోనూ వారు అమ్ముడు పోయారనేంత వరకూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మరోవైపున ఈ నాయకులు కూడా ఆ విధంగానే స్పందించారు. ఎవరూ ఏమీ మాట్లాడొద్దంటూ చంద్రబాబు ఉభయులకూ ఒకటే చెబుతూ వచ్చారు తప్ప ఎవరి పక్షం తీసుకోలేదు. ఇది వాస్తవానికి రేవంత్‌ను కాపాడ్డమే. దానికి తగినట్టే ఆయన కూడా ఆఖరి ఘట్టంలో మళ్లీ ఆరోపణలు చేయకుండా వచ్చేశారు. చంద్రబాబు అసలే రాజకీయ స్పందన లేకుండా పార్టీని కాపాడుకోవడం వరకే మాట్లాడారు. అంతకుముందు తీవ్రంగా మాట్లాడిన టిటిడిపి నేతలు కూడా ఆయన మమ్ముల్ను అనలేదు మేము ఆయనను అనము అంటూ సర్దుకున్నారు. అన్నారు కదా అని విలేకరులు ప్రశ్నిస్తే ఆఫ్‌ద రికార్డ్ వ్యాఖ్యలు తప్ప ఆయన సూటిగా మాట్లాడలేదని సమర్థించుకున్నారు. అలాగే టిఆర్ఎస్ నేతలు కూడా రేవంత్ ఉదంతాన్ని తేలిగ్గా తీసుకున్నారు.ఆయన తమపై ధ్వజమెత్తుతున్నా ఆ స్థాయిలో స్పందించలేదు. కావాలనే నిర్లక్ష్యం చేశామని అనొచ్చుగాని వాస్తవంలో ఈ ఘట్టం ఇలా పోనివ్వాలని వారికి ఆదేశాలు వుండి వుండాలి. లేకుంటే ఓటుకునోటుతో సహా పాత పురాణాలు తవ్వితీసేవారే. అందులోనూ కెసిఆర్ కుటుంబంపై అతి తీవ్రంగా విమర్శలు చేసే రేవంత్‌ను అనకుండా ఆగారంటే అత్యున్నత స్తాయిలో ఆదేశాలు వుండి వుండాలి. ఇంత జాగ్రత్త ఎందుకు తీసుకున్నారంటే రేవంత్‌కు తెలిసిన విషయాలు అలాటివి మరి! అయితే ఆయన కూడా మొదట టిడిపిపై చేసిన విమర్శలు తర్వాత ఎందుకు కొనసాగించలేదు? దీనికి మరో కారణం కూడా వుంది. తన మాటలతో కొందరైనా తిరుగుబాటు చేసి వస్తారని దుమారం రేగుతుందని ఆశించి వుంటారు. అయితే భారత దేశంలో పార్టీల వ్యవస్థ చాలా బలమైంది. ఎంతటి వ్యక్తులు వెళ్లిపోయినా ఆ వ్యవస్థలు కొనసాగుతూనే వుంటాయి. ఎన్టీఆర్, ములాయం సింగ్‌లపై తిరుగుబాట్ల తర్వాత కూడా సమాజ్‌వాది, తెలుగుదేశం పార్టీలు ఇప్పటికీ నిలిచివున్నాయంటే కారణం అదే. ఇది రేవంత్ కూడా అర్థం చేసుకున్న సత్యం. అందుకే ఆయన ఆఖరుకు వచ్చేసరికి నిష్టూరాలు లేకుండానే నిష్క్రమించారు.