లాంఛనం పూర్తయిపోయింది. ఎలాంటి హడావుడి లేకుండా తన పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి వెళ్లిపోయారు. పక్కా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను ఇచ్చారు. రేవంత్ చుట్టూ ఈ మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా ఇదేమీ అనూహ్యమైన పరిణామం కాదు. కాకపోతే, పక్కా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకే ఓ సవాలు వదిలేసి వెళ్లిపోయినట్టయింది! తెలంగాణలో ఫిరాయింపుల్ని రేవంత్ రెడ్డి మొదట్నుంచీ తప్పుబడుతూ వచ్చారు. కేసీఆర్ చేసిన రాజకీయాల వల్లనే రాష్ట్రంలో టీడీపీ జీర్ణావస్థకు చేరుకుందని అనొచ్చు. దీంతో తెలంగాణలో ఫిరాయింపులకు వ్యతిరేకంగానే టీడీపీ వ్యవహరిస్తూ వచ్చింది. కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయి, రేవంత్ బయటకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.
అయితే, ఆంధ్రాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది కదా! ఇదే టీడీపీ ఆంధ్రాలో అధికార పార్టీగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి, వైకాపా నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది. జంప్ జిలానీల్లో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టేశారు. ఫిరాయింపు రాజకీయాల విషయంలో రెండు రాష్ట్రాల్లోనూ రెండు రకాల సిద్ధాంతాలను టీడీపీ అనుసరిస్తోంది! సరే, ఇప్పుడు రాజీనామా చేయడం ద్వారా రేవంత్ అన్యాపదేశంగా ఓ సందేశం ఇచ్చారు. ఫిరాయింపు రాజకీయాలు తనకు చేతగావనీ, స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రాన్ని ఇచ్చిన తరువాతనే పార్టీ వదిలి వెళ్తున్నానని చెప్పకనే చెబుతున్నారు. ఫిరాయింపు నేతలంతా ఇలా చేయగలరా..? వారితో తనలానే రాజీనామాలు చేయించగలరా అంటూ తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలను అప్రకటితంగానే రేవంత్ నిలదీసినట్టు అవుతోంది.
ఈ సందర్భాన్ని ఏపీలో ప్రతిపక్ష వైకాపా వాడుకునే అవకాశం కచ్చితంగా ఉంది. ఎందుకంటే, ఫిరాయింపు నేతలపై అనర్హత వేటు వేయడం లేదు కాబట్టే అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నాం అంటూ జగన్ తాజాగా నిర్ణయించారు. జంప్ జిలానీలపై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాశారు. ఈ సందర్భంలో.. ‘రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి మరీ బయటకి పంపుతున్న మీరు, వైకాపా నుంచి రాజీనామాలు చేయకుండా వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇదే సంప్రదాయన్ని ఎందుకు అనుసరించడం లేదు’ అని ప్రశ్నించే ఆస్కారం ఉంది. రేవంత్ విషయంలో క్రమశిక్షణా పార్టీ విలువలూ అదీఇదీ అంటూ హడావుడి చేసిన టీడీపీ, వైకాపా ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించకపోవడం ఏ తరహా విలువలకు నిదర్శనం అని నిలదీసే అవకాశం ఉంది. రాజీనామా చేసిన వెళ్లడం ద్వారా ఈ తరహా చర్చకు రేవంత్ ఆస్కారం ఇచ్చారనే చెప్పాలి. ఈ సందర్భాన్ని ఫిరాయింపు రాజకీయాలపై పోరాటంలో భాగంగా వైకాపా ఏ మేరకు వాడుకుంటుందో చూడాలి.