తెలుగుదేశం శాసన సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రం పంపించారు. కాబట్టి, దీన్ని సభాపతి కచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. రేవంత్ విషయంలో కూడా స్పందించేందుకు స్పీకర్ ఇంకెంత తాత్సారం చేస్తారో చూడాలి. వెంటనే ఆమోదిస్తే ఒక తలనొప్పి, ఆమోదించకపోతే ఇంకో సమస్య అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఆమోదిస్తే వెంటనే కొడంగల్ ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. అప్పుడు రేవంత్ ప్రచారం ఎలా ఉంటుందీ అంటే… కేసీఆర్ కు ధీటుగా తలపడే సత్తా తనకు ఉంది కాబట్టి ధైర్యంగా రాజీనామా చేశా అంటారు. ఆ ధైర్యం ఇతర ఫిరాయింపు నేతలకు లేదనీ, వారు ఓడిపోతారన్న భయంతోనే కేసీఆర్ రాజీనామాలు చేయించడం లేదని చెప్పుకుంటారు. కొడంగల్ ఎలాగూ రేవంత్ సొంత నియోజక వర్గం. పార్టీతో సంబంధం లేకుండా అక్కడ రేవంత్ కు సొంత కరిజ్మా ఉంది. కాబట్టి, ఉప ఎన్నిక వస్తే ఏ పార్టీ తరఫున రేవంత్ బరిలోకి దిగినా గెలుపు దాదాపు ఖాయమనే చెప్పొచ్చు. అదే జరిగితే కాంగ్రెస్ కి కొత్త బలం వచ్చినట్టు అవుతుంది. కేసీఆర్ పై రేవంత్ తొలి విజయం అవుతుంది!
అలాగని, అధికారంలో ఉన్న తెరాస కొడంగల్ నియోజక వర్గాన్ని అంత సులువుగా వదిలేస్తుందనీ అనుకోలేం. ఇప్పటికే ఆ నియోజక వర్గం నుంచి రేవంత్ అనుచరుల్లో కొంతమందికి గులాబీ కండువా కప్పేశారు. మరి కొంతమందిని కూడా దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఇక, రొటీన్ గా కొడంగల్ లో ఎలాగూ అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా మొదలైపోతాయి. అక్కడి సమస్యలకు త్వరత్వరగా పరిష్కార మార్గాలు చూపించాలని తెరాస వ్యూహ రచన చేస్తుంది. దీనికి ధీటుగా రేవంత్ స్పందించాల్సి ఉంటుంది. ఈ కోణం నుంచి ఆలోచిస్తే.. ఉప ఎన్నికను ఎదుర్కోవడం రేవంత్ కు నల్లేరు మీద నడక అయితే కాదు అనిపిస్తుంది.
సొంతంగా రేవంత్ కి ఉన్న గుర్తింపు, స్థాన బలిమి తెరాస దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలకు కొన్నాళ్లు ముందు ఈ ఉప ఎన్నిక అవసరమా అని భావిస్తే… రేవంత్ చేసిన రాజీనామాపై కాలయాపన చేయాలి. సాంకేతికంగా అది సాధ్యం కానట్టుగానే కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. రేవంత్ ఊరుకోరుగా! కొడంగల్ ఉప ఎన్నిక వస్తే ఓడిపోతామన్న భయంతోనే తన రాజీనామాను కేసీఆర్ సర్కారు ఆమోదించలేకపోతోందని రెచ్చగొడతారు. స్పందిస్తే ఒక సమస్య, స్పందించకపోతే మరో సమస్య. ఉప ఎన్నికకు తెరాస సిద్ధమైతే… ఫిరాయింపుదారులతో కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లే సత్తా లేదా అంటూ మరో చర్చ లేవదీస్తారు. ఏదేమైనా, రేవంత్ రాజీనామాతో తెరాసలో కూడా ఒక రకమైన గందరగోళ వాతావరణం సృష్టించినట్టు అయింది. మరి, రేవంత్ రాజీనామా విషయమై స్పీకర్ స్పందన ఏంటనేది తేలితే.. కొడంగల్ ఉప ఎన్నిక పరిస్థితి ఏంటో స్పష్టత వస్తుంది. ఉప ఎన్నిక జరిపినా, జరపకపోయినా తెరాసకు ఇబ్బందే కనిపిస్తోంది.