అంతే అనిపిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇక దాదాపు నూకలు చెల్లినట్టే అనుకోవచ్చు. నిన్నా మొన్నటి దాకా దింపుడు కళ్లం ఆశతో ఊగిసలాడిన ఆ పార్టీకి ఇక అది కూడా ఆవిరైనట్టే చెప్పకోవచ్చు. నిజానికి గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ఆంధ్రా నాయకత్వంలో ఉన్న పార్టీలకు కాలం చెల్లినట్టు అర్ధమైంది. ఆ విషయాన్ని చాలా తొందరగా అర్ధం చేసుకున్న వైకాపా చప్పున ఇక్కడ నామమాత్రం చేసేసి, ఆంధ్రాకు వెళ్లిపోయింది. అయితే ఎంతైనా టీడీపీ సీనియర్ పార్టీ కాబట్టి, పైగా 15మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది కాబట్టి… చింత చస్తేనేం… పులుపు బలుపు చూపించలేకపోతామా అన్నట్టు బింకాలు పోయింది. కొంత కాలం సైలెంట్ గా ఉంటే ఆ పార్టీకి కొద్దో గొప్పో మంచి రోజులు వచ్చేవేమో… కాని ఓటుకు నోటు సమర్పించబోయి… తనను తానే కెసియార్కు అప్పనంగా సమర్పించేసుకుంది. హైదరాబాద్ అనే నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే అని చెప్పుకునే పార్టీ… చివరకు ఆ నగరంలో చిరునామా కూడా కోల్పోయింది. జి హెచ్ ఎం సి ఎన్నికల్లో కనాకష్టంగా ఒక్కవార్డు మాత్రం దక్కించుకుని…సెటిలర్స్ కూడా తనకు మద్ధతివ్వడం లేదని తేల్చుకుంది.
ఇది అందరికీ తెలిసిన కధ అయితే..ఈ .ఫ్లాష్ బ్యాక్ ఆధారంగా ఇక జరగబోయే కధ కూడా ఊహించడం పెద్ద కష్టమేం కాదు. ఓటుకు నోటు తర్వాత చంద్రబాబు తప్పనిసరిగా కెసియార్కు జీ హుజూర్ అనాల్సి వచ్చింది. అది దాదాపు తెలంగాణ తెలుగుదేశం పార్టీ మొత్తానికి అర్ధమైంది. నిజానికి ఇప్పుడు తెలంగాణలో పార్టీని రక్షించుకునే ఓపిక, తీరిక చంద్రబాబుకు లేవనేది సుస్ఫష్టం. ఎందుకంటే… ఆంధ్రప్రదేశ్లోనే ఆయనకు పీకల్దాకా సమస్యలున్నాయి. కొత్త రాజధాని దగ్గర మొదలుపెడితే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం వంటివి ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పైగా ఆయనకు అక్కడ బలమైన ప్రత్యర్ధి ఉన్నాడు. ఇవాళో రేపో రాజకీయ రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న ఆయనకు తన పార్టీని కలకాలం నిలిచేలా తీర్చిదిద్దడం, తన కొడుకుని వారసునిగా నిలబెట్టడం… వంటి చాలా ముఖ్యమైన లక్ష్యాలున్నాయి. కాబట్టే స్పష్టంగా ఆయన తెలంగాణ నేతలను ఉధ్ధ్యేశించి ఒక మాట అన్నారు అదే ఎవరి భవిష్యత్తు వారు చూసుకుంటున్నారు అని. అన్యాపదేశంగా అందులో తప్పేం ఉంది అన్నట్టు కూడా ఆయన మాటలున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం భవిష్యత్తు కెసిఆర్ దయపైనే ఆధారపడి ఉన్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదెలా అంటే…
రేవంత్రెడ్డి వెంట ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి. నరేందర్రెడ్డి, సతీష్ మాదిగ…. అంటూ ఒకరొకరుగా తేదాపాను వీడుతున్నారు. సరే… ఈ వలసల ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఎల్.రమణ లాంటివాళ్లు, గవర్నర్ గిరీని కలలో కూడా మర్చిపోని మోత్కుపల్లి వంటి నేతలు కొందరు ఆగవచ్చు. అయితే వచ్చే ఎన్నికల్లో కెసియార్తో పొత్తు కుదరాలని మాత్రమే వీరు ప్రార్ధిస్తూ కూర్చోవాలి తప్ప అంతకు మించి చేయగలిగింది ఏమీ కనపడడం లేదు. అలా కుదిరితే నాలుగో ఐదో సీట్లు వస్తేనే… టీడీపీకి తెలంగాణ ప్రాంతంలో నూకలు ఉన్నట్టు. లేకపోతే… అంతే. అయితే అంపశయ్య మీద ఉన్న ఆంధ్రానేత పార్టీకి ఆక్సిజన్ ఇచ్చి కాపాడాల్సిన అవసరం కేసియార్కి ఉంటుందా అనేదే… భవిష్యత్తు తేల్చాల్సిన అంశం.