చిత్రసీమలో గత కొంతకాలంగా ఆరోగ్యకరమైన పోటీ నడుస్తోంది. ఓ పెద్ద సినిమా వస్తోందంటే, మరో పెద్ద సినిమా విడుదల వాయిదా వేసుకొంటోంది. ఇద్దరు నిర్మాతలు మాట్లాడుకొని, ఓ నిర్ణయానికి వచ్చి, ఓ సినిమా వెనక్కి తగ్గడం వల్ల రెండు సినిమాలకూ మేలు జరుగుతోంది. సంక్రాంతికో, మరీ ముఖ్యమైన పండగ రోజునో తప్ప..పెద్ద సినిమాలు ఒకేసారి రావడం లేదు. అందులోనూ ఒకే రోజు. కాకపోతే ఇప్పుడు నా పేరు సూర్య, భరత్ అను నేను రెండూ ఒకే రోజున ముహూర్తాలు నిర్ణయించుకొన్నాయి. ఏప్రిల్ 27నే రెండు సినిమాలూ వస్తున్నాయి. ఏప్రిల్ వరకూ టైమ్ ఉంది కదా, అప్పుడు చూద్దామనే ఛాన్సు లేదిక్కడ. ఎందుకంటే రెండూ పెద్ద సినిమాలే. ఇద్దరూ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్టు కనిపించడం లేదు. ‘ఖుషి’ రిలీజ్ డేట్ అనే సెంటిమెంట్‌తో మెగా ఫ్యాన్స్ కోసం బన్నీ రంగంలోకి దిగుతున్నాడు. మహేష్ కూడా పట్టిన పట్టు వదలడం లేదు. దాంతో… ఇద్దరు పెద్ద హీరోల మధ్య పంతం పెరుగుతున్నట్టవుతోంది.
నిజానికి ఈ రిలీజ్‌డేట్ గేమ్‌లో న్యాయం… బన్నీ పక్షానే ఉంది. ఎందుకంటే, నా పేరు సూర్య రిలీజ్ డేటే ముందుగా ప్రకటించారు. ఆ తరవాత భరత్ అను నేను రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. రిలీజ్ డేట్ విషయంలో ఇద్దరు నిర్మాతలు మాట్లాడుకోవడం గానీ, ఓ అంగీకారానికి రావడానికి గానీ ఇంకా టైమ్ ఉంది. కాకపోతే.. పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణానికి ఇది తూట్లు పొడవడం ఖాయం. పంతం కొద్దీ ఒకే రోజు రెండు సినిమాల్నీ విడుదల చేసుకొనే పరిస్థితి లేదు. అది రెండింటికీ మంచిది కాదు. ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలి. అలా తగ్గితే ‘భయపడిపోయారు’ అనే అపప్రద మూటగట్టుకోవాల్సివస్తుంది. ఈ విషయంలో ఎవరెలాంటి నిర్ణయం తీసుకొంటారన్నది ఆసక్తిగా మారింది.