ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సంకల్పం పేరిట పాదయాత్ర తలపెడితే దానిపై ప్రభుత్వ పక్షం టిడిపి సమీక్ష జరపడమేమిటని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆలూలేదు చూలూలేదు అని తమ నాయకుడి యాత్ర ఇంకా మొదలవకముందే కుట్రల గురించి శాంతి భద్రతల భగం గురించి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడ్డంపై ఆగ్రహిస్తున్నారు. టీవీ చర్చలలో ఈ విషయం వచ్చినప్పుడు నేనూ ఆ వ్యాఖ్యలు సరికాదన్నాను. పదేళ్ల ప్రతిపక్ష జీవితంలో చంద్రబాబు వస్తున్నా మీకోసం లాటి యాత్రలు చేశారు. వాటిపై అప్పటి ప్రభుత్వాలు విమర్శలు చేసి వుండొచ్చు గాని ముందే విరుచుకుపడింది లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నిజంగానే ఏవైనా ఇన్పుట్స్ వుంటే వాటిని పోలీసులకు నిఘా విభాగానికి పంపి అప్రమత్తం చేయాలి గాని టిడిపి సమావేశంలో చెప్పడమేమిటి? కార్యకర్తలను పురమాయించడమేమిటి? ఇలా అయితే నిజంగానే ఘర్షణ ఉద్రిక్తత పెరుగుతాయి కదా.. అసలు జగన్ యాత్ర అన్నంత మాత్రాన ఏదో జరిగిపోతుందని రాజకీయంగా ఎదుర్కోవాలని ముందే చర్చలు చేయడం వారి ప్రచారానికే దోహదం చేస్తుంది. రాజకీయాల్లో అంత అసహనం కూడా ప్రజలు మెచ్చరు.జగన్పై కేసులు ఎప్పుడు పరిష్కారమవుతాయనేది కోర్టులు చూసుకోవాల్సిన విషయం. ప్రతిపక్ష నేత అప్పటి వరకూ అసెంబ్లీలో గాని బయిట గాని ఏం మాట్లాడినా వాటినే ముందుకు తెస్తూ నేరస్తుడిగానే చూపడం చూడటం మానుకోవడం మంచిది.