రాజకీయ ఆరంగేట్రానికి సిద్ధమవుతున్న విలక్షణ నటుడు కమల్ హాసన్ అందుకు తగిన పోరాట స్ఫూర్తిని అలవరుచుకుంటున్నట్టు కనపడుతోంది. మొదట తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించడంతో పాటు మద్ధతు కోసం పలు పార్టీల నేతలతోనూ మంతనాలు జరిపిన ఈ తమిళనాడు వాసి… ప్రస్తుతానికి తన మద్ధతుదారుల సంగతెలా ఉన్నా ప్రత్యర్ధుల్ని మాత్రం నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టే ఆయన రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు.
గతంలో ప్రధాని మోడీని కలిసి చర్చలు జరిపిన కమల్… కొన్ని రోజులుగా మాత్రం భాజాపాతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. నోట్లరద్దు విషయంలో అప్పట్లో తాను మోడీని అభినందించి తప్పు చేశానన్న కమల్ ఆ నిర్ణయం ఎంత మాత్రం సరైంది కాదని విమర్శించడం తెలిసిందే. అదే క్రమంలో ఆయన ఒకటొకటిగా విమర్శలు సంధిస్తూనే ఉన్నారు.
గతంలో తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు నిలవెంబు కషాయం అనే ఆయుర్వేద మందు విషయంలోనూ కమల్ హాసన్ విభేధించారు. ఈ మందు డెంగ్యూ వ్యాధిని సమర్ధవంతంగా అరికట్టగలదని ప్రభుత్వం నమ్మడం, దాన్ని ప్రమోట్ చేసిన నేపధ్యంలో ఈ మందు సత్తాను వైద్యులు లేబరేటరీల్లో నిర్ధారించేవరకూ దాన్ని వాడవద్దని, ఎవరికీ ఇవ్వొద్దని కమల్ అభిమానులకు పిలుపిచ్చాడు. ఇది హిందూత్వ భావజాలానికి వ్యతిరేకమని పలువురు ఆయనపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత మెర్సల్ సినిమా వివాదంలో సైతం విజయ్‌కు కమల్ మద్ధతుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా… మూడ్రోజుల క్రితం హిందూ టెర్రర్ అనే పదాన్ని కమల్ ఉపయోగించడంతో… కమల్-కమలం మధ్య ఘర్షణ మరింత ముదిరినట్టయింది.
దేశంలో హిందూ తీవ్రవాదం పెరిగిపోతోందని కమల్ ఆరోపించారు. గతంలో ఈ పరిస్థితి లేదన్నారు. గతంలో ఇతర గ్రూప్స్‌లోని తీవ్రవాద భావాలను హిందువులు ఆక్షేపించేవారని, ఇప్పుడు హిందువుల్లో కూడా ఇలాంటి భావాలు తలెత్తడం ఆందోణ కలిగిస్తోందని ఆయన అన్నారు. దీంతో భాజాపా కు మద్ధతు పలికే విశ్వహిందూ పరిషత్ లాంటి సంస్థలు కమల్‌పై విరుచుకుపడ్డాయి. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. లేకపోతే నిరసనలు విస్త్రుతం చేస్తాయని హచ్చరించాయి. మరోవైపు కమల్ వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ వంటి నటులు సమర్ధిస్తూ మాట్లాడారు. ఏదేమైనా… బలమైన నాయకుడిని ఢీకొంటేనే బలమైన నాయకుడిగా తయారవుతాం అన్న సూత్రాన్ని కమల్ సరిగానే వంటబట్టించుకున్నట్టు కనిపిస్తోంది. చూద్దాం… మోఢీని ఢీకొడుతున్న ఈ మూవీస్టార్ ఎంత మేరకు ఎస్టాబ్లిష్ అవుతారో…