వైఎస్ జగన్ పాదయాత్ర మొదలైంది. వైసిపి క్యాడర్ కి ఒక్కసారి గా ఊపు వచ్చింది. ఇక ఎన్నికలు వచ్చేసాయి, అధికారం దగ్గర్లోనే ఉంది అన్నంత ఉత్సాహం వచ్చేసింది. ఇక స్పీచ్ లతో జగన్ కూడా చంద్రబాబు మీద విరుచుకుపడ్డాడు. మరి అంతా ఓకే నా? మొదటిరోజు యాత్ర గ్రాండ్ సక్సెసేనా? ఈ పాదయాత్ర ఇదే తీరుగా కొనసాగితే జగన్ కి అధికారం నల్లేరు పై నడకేనా?
జగన్ యాత్ర లు చాలా చేసాడు- ఓదార్పు యాత్ర, పరామర్శ యాత్ర లాంటివి. కానీ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర మాత్రం ఇదే మొదటి సారి. కానీ మొదటి రోజు యాత్ర తో మొన్న నంద్యాల లో జరిగిన పొరపాటే మళ్ళీ పునరావృతం అవుతున్నట్టు, అవబోతున్నట్టు స్పష్టమైంది . నంద్యాల లో జగన్ కి బాగా పాజిటివ్ గా ఉంది అనుకున్న తరుణం లో రోజా వ్యాఖ్యలు, జగన్ వ్యాఖ్యలు ఫలితాన్ని తారుమారు చేసాయంటారు కొందరు విశ్లేషకులు. మరి ఇప్పుడు పాదయాత్ర ప్రారంభం సందర్భంగా అదే రిపీటవుతోంది. రోజా మాట్లాడుతూ, “చంద్రబాబు భయపెడదామనుకుంటే దానికి జగన్ ఇంట్లో కుక్కలు కూడా భయపడవు” అని లైవ్ లో వ్యాఖ్యానించారు. ఆమె ఉద్దేశ్యం జగన్ కి మేలు చేయడమే అయినా ఆ వ్యాఖ్యల పర్యవసానం ఎలా ఉంటుందో అన్న అవగాహన మాత్రం ఆమెకి లేనట్టే ఉంది. ఇక జగన్ స్పీచ్ కూడా అదే మూస లో సాగింది. ప్రజా సమస్యలు ఎక్కువగా ప్రస్తావించాల్సింది పోయి, చంద్రబాబు అంత మోసగాడు దేశం లో లేడు అంటూ చంద్రబాబు గురించి ఏకరువు పెట్టడం చూస్తూంటే, జగన్ “రిట్రాస్పెక్షన్” చేసుకున్నదేమీ లేదని తెలుస్తోంది.
మరి ఇప్పటికైనా జగన్ తన పంథా మార్చి పాదయాత్ర ని సక్సెస్ చేసి ప్రజలని ఆకట్టుకుంటాడా లేక ఆర్నెల్లూ బాబు ని తిడుతూ, నేనే కాబోయే ముఖ్యమంత్రిని అని చెబుతూ ప్రజల కి మొహం మొత్తేలా చేస్తాడా, వేచి చూడాలి.