దేశ ప్రజలు అంతకు మించిన ప్రకృతి విపత్తులను కూడా తేలికగా మర్చిపోతారేమో కాని గత నవంబరు 8ని మాత్రమ మర్చిపోలేరు. ఒక్క ప్రకటనతో పెద్ద నోట్లను రద్దు చేసేసిన కేంద్రం దేశ ప్రజానీకానికి మరచిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది. అయితే దీని ద్వారా సాధించింది ఏమిటి? అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది.
మరోవైపు నోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంలో అధికార, విపక్షాలు రాజకీయాలకు శ్రీకారం చుట్టాయి. బుధవారం బ్లాక్ డే జరుపుతామని ప్రతిపక్షాలు అంటుంటే… దీన్ని నల్లధనం వ్యతిరేక దినంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపధ్యంలోనే అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
నోట్ల రద్దుపై గళం విప్పిన మన్మోహన్…పెద్ద నోట్ల రద్దుతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైందన్నారు. అంతేకాకుండా 99శాతం డబ్బు బ్యాంకులకు తిరిగి వచ్చేసిందని గుర్తు చేశారు. పనిలో పనిగా జీఎస్టీపైనా ఆయన విమర్శలు గుప్పించారు. మన దేశంలో… జిఎస్టీ సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల దాయాది దేశమైన చైనాకు ప్రయోజనం చేకూరింది అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎద్దేవా చేశారు.
అయితే ప్రభుత్వం ఈ విమర్శలను ఖండించింది. నోట్లరద్దుతో నల్లధనం విషయంలో ఆశించిన ప్రయోజనాలను సాధించాం అని పి.ఎం.వో కార్యాలయం మంగళవారం ప్రకటించింది. దేశంలో నల్లధనం భారీగా బయటపడిందని, దీని ద్వారా బ్యాంకు ఖాతాల్లోని లొసుగులు వెల్లడయ్యాయి అని చెప్పింది. మొత్తం… 23.22లక్షల ఖాతాల్లో 3.68లక్షల కోట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని వివరించింది. 17.73లక్షల ఖాతాల్లో చూపినదానికి ఆదాయపు పన్ను లెక్కలకు భారీ వ్యత్యాసాలున్నాయంది. అదే విధంగా ఇంకా రూ.16వేల కోట్ల నగదు బ్యాంకులకు రావాల్సి ఉందని తేల్చింది. అంతేకాక…బ్యాంకుల్లో రూ.4.7లక్షల విలువైన అక్రమ లావాదేవీలను గుర్తించాం అని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది.
ఒక విప్లవాత్మకమైన చర్య చేపట్టినప్పుడు దాని వల్ల కొద్దో గొప్పో మంచి ఫలితాలు రావని అనలేం. ఇప్పుడు పిఎంఓ చెబుతున్న ప్రకారం… పలు రకాల అవకతవకలు బయటపడి ఉండొచ్చు…వీటిని సరిదిద్దడం ద్వారా ఉపయోగం ఉండొచ్చు. అయితే అదే సరిపోతుందా? దీని ద్వారా నల్లకుబేరుల భరతం పడతానని లేకపోతే తనను ఉరితీయండని అంటూ చేసిన ప్రసంగానికి తగిన ఫలితాలేనా ఇవి?
దేశ ప్రజలు దాదాపు 100 రోజుల పాటు కష్టనష్టాలు ఎదుర్కున్నారు. క్యూలలో నుల్చోవడం ద్వారా ఎన్నో పనిగంటలతో పాటు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆర్ధిక రంగం నష్టపోయిన తీరునైతే ఎంత లెక్కించినా తేలదేమో… మరి వీటన్నింటికీ ధీటైన ఫలితాన్ని రాబట్టామా లేదా? అనేది తేట తెల్లం కావాలి. అప్పుడుగాని సగటు జీవికి ఈ నోట్లరద్దు అంశం అందించిన లాభనష్టాలపై స్పష్టత రాదు.