ఈ వారం మొత్తం తమిళ సినిమాల దండయాత్ర కొనసాగనుంది. డిటెక్టివ్ అనే విశాల్ సినిమా, గృహం అనే సిద్దార్థ సినిమా, విజయ్ “మెర్సల్” అనువాదం అదిరింది అనే సినిమా విడుదల కానున్నాయి. వీటన్నింటి మధ్య ఒకే ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కానుంది, అదే మంచు మనోజ్ “ఒక్కడు మిగిలాడు”.
ఇక ఈ తమిళ సినిమాలన్నీ ఆల్రెడీ తమిళం లో విడుదలయి, ఫలితాలు తెలిసినవే కావడం గమనార్హం. విశాల్ డిటెక్టివ్ సినిమా షెర్లాక్ హోమ్స్ తరహా కథ. దీనికి దర్శకత్వం వహించింది మిస్కిన్. ఆ మధ్య తెలుగు లో డబ్ అయి హిట్ అయిన హారర్ థ్రిల్లర్ సినిమా “పిశాచి” దర్శకుడీయన. విశాల్ కి చాలా కాలం తర్వాత హిట్టిచ్చి ట్రాక్ లోకి తెచ్చిన సినిమా ఇది.
మరొక సినిమా గృహం. ఇది పోయిన వారం తమిళ్ లో విడుదలై, మంచి టాక్ తెచ్చుకుంది. ఒకప్పుడు తెలుగు పరిశ్రమ నే తన “బొమరిల్లు” గా చేసుకుని వరస హిట్లతో దూసుకుపోయి, ఆ తర్వాత ఫ్లాపుల బాట పట్టి బ్రేక్ కోసం చాలా కాలం గా ఎదురు చూస్తున్న సిద్దార్థ ని మళ్ళీ “ఆట” లో నిలబెట్టింది ఈ సినిమా. ఇక ఈ వారం తెలుగు లోకి వస్తోంది. ఇక్కడ ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఇక అదిరించి సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకి ఆల్రెడీ బాగా తెలుసు, జీఎస్టీ వివాదం పుణ్యమా అని.విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించడమే కాక తమిళ పరిశ్రమ మొత్తం విజయ్ కి మద్దతు ఇచ్చేలా చేసిందీ సినిమా.
ఇన్ని తమిళ సినిమాల మధ్య లో ఒక తెలుగు సినిమా ఒక్కడు మిగిలాడు. అయితే ఈ సినిమా కూడా ఎల్టీటీఇ నేపథ్యం లో సాగుతూ తమిళ లింక్ కలిగి ఉండటం కాకతాళీయమే. అయితే విశాల్, సిద్దార్థ లు చాలా యేళ్ళ తర్వాత ట్రాక్ ఎక్కినట్టు, పోయిన వారం గరుడవేగ తో రాజశేఖర్ సక్సెస్ లోకి వచ్చినట్టు మంచు మనోజ్ కూడా ఈ సినిమాతో ఫాం లోకి వస్తాడేమో వేచి చూడాలి.