ఎపి 24/7 ఛానల్ అధికారికంగా నవంబరు 10న విజయవాడలో ప్రారంభం కాబోతున్నది. ఆంధ్ర ప్రదేశ్ తొలి శాటిలైట్ ఛానల్ అని ప్రచారం చేశారు. కేబుల్ చానల్‌గా సిటీ కేబుల్ దేశంలోనే తొలిసారి ఇక్కడే ప్రసారమైందంటారు కనుక శాటిలైట్ అని నొక్కి చెబుతున్నారు.అన్నపూర్థా బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మొదలవుతున్న ఎపి ఛానల్ యజమాని వ్యాపారవేత్త నరసింహరాజు కాగా సర్వసారథ్యం వెంకటకృష్ణదే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారు. స్పీకర్ కోడెలతో పాటు తెలంగాణ మంత్రి హరీశ్ రావు, వైసీపీనేత బొత్స, పిసిసిఅద్యక్షుడు రఘువీరాలను ఆత్మీయ అతిధులుగా ఆహ్వానించారు. ఇంకా అనేక మంది మంత్రులూ ప్రజా ప్రతినిధులూ గౌరవ అతిధులుగా వున్నారు. అడుగుజాడల,జైహింద్, స్టార్ షో, కలర్స్, ప్రజా క్షేత్రం, నమస్తే ఎన్ఆర్ఐ, కీచురాళ్లు, అదీ మ్యాటర్ వంటి కార్యక్రమాలు వస్తున్నట్టు ప్రకటించారు. రెండు రాష్ట్రాల రాజధానుల లోగోలతో క్యాపిటల్ టైమ్స్ గాక ప్రత్యేకంగా తెలంగాణ రిపోర్ట్ వుంటుందట.ఇప్పటికే టెస్ట్ సిగల్ వస్తున్నందువల్ల చానల్ రూపురేఖలు చూచాయగా అర్థమవుతున్నాయి.
ఇక మరో ఛానల్ మహాటీవీ ఎన్ఆర్ఐల ప్రోత్సాహంతో.. పాత్రికేయుడు వంశీకృష్ణ సారథ్యంలో ఎబిఎన్ ఫేస్‌గా పనిచేసిన మూర్తి సిఇవోగా అమరావతిలో ప్రారంభం కానుంది. గత యాజమాన్యానికి ఇకపైన చాలా పరిమితంగానే వాటాలు వుంటాయంటున్నారు. లైసెన్సు జాప్యం నివారించేందుకు వున్న చానల్ కొన్నారట. నూతన సంవత్సరం తొలిమాసంలో ప్రసారాలు ప్రారంభించాలని సంకల్పించారు. సినిమా, వ్యాపారంఇంకా ఎక్కువ భాగం హైదరాబాదులోనే వుంది గనక ఎపి ఛానళ్లు ఇంచుమించు సగం పనులు ఇక్కడే చేయవలసి వుంటుందని కూడా భావిస్తున్నాయి. ముందుగా వస్తున్న వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తేనే మిగిలిన వారు కూడా వస్తారని మీడియా వర్గాలు చెబుతున్నాయి.