మలయాళంలో సూపర్ హిట్టైన సినిమా ‘టూ కంట్రీస్’. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సునీల్ కథానాయకుడు. ఎన్.శంకర్ దర్శకుడు. ఆయనే నిర్మాత కూడా. షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాకి తగిన తెలుగు టైటిల్ కోసం చిత్రబృందం చాలా రకాలుగా ప్రయత్నించింది. దాదాపుగా డజను పేర్లు సిద్ధం చేసింది. అయితే వాటన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు ‘టూ కంట్రీస్’ పేరే మళ్లీ ఈసినిమాకీ పెట్టేసుకొంది. ”చాలా రకాల టైటిళ్లు పరిశీలించాం. కానీ టూ కంట్రీస్ పేరే కరెక్ట్‌గా ఉంటుందనిపించింది. అందుకే అదే ఖరారు చేశాం” అని శంకర్ చెప్పారు. చిత్రీకరణ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందీ సినిమా. డిసెంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సునీల్ కెరీర్ పూర్తిగా తిరోగమన దశలో ఉంది. పైగా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శంకర్, తన సొంత సంస్థలో ఈసినిమా చేస్తున్నారు. మలయాళం రీమేక్ కాబట్టి ఆశలు పెట్టుకోవొచ్చేమో. త్వరలోనే పాటల్ని, ట్రైలర్‌ని విడుదల చేస్తామని చిత్రబృందం చెబుతోంది.