రాష్ట్ర విభజన వలన తెలంగాణా రాష్ట్రం లాభపడగా ఆంద్రప్రదేశ్ మాత్రం చాలా నష్టపోయింది. ఆర్ధికంగా చాలా దెబ్బ తినడమే కాకుండా రాష్ట్రాన్ని మళ్ళీ మొదటి నుండి పునర్నిర్మించుకోవలసిన పరస్థితి ఏర్పడింది. కానీ ఇదంతా కళ్ళారా చూసిన తరువాత కూడా మళ్ళీ రాష్ట్ర విభజన చేసి రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు పోరాటాలు చేస్తామని ఎవరయినా చెపితే ఏమనుకోవాలి? ఆ మాట అధికార పార్టీకి చెందిన వ్యక్తే చెపుతుంటే ఇంకెలా ఉంటుంది?
రాయలసీమ, ఉత్తరాంధ్రా హక్కుల వేదిక అధ్యక్షుడు మరియు తెదేపా సీనియర్ నేత టి.జి. వెంకటేష్ ఈ హెచ్చరిక చేస్తున్నారు. రాయలసీమకు ప్రత్యేక హక్కులు, ప్యాకేజీ కల్పిస్తేనే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి ఉంటామని లేకుంటే విడిపోతామని చెపుతున్నారు. ఇంతకు ముందు హైదరాబాద్ నుండి రాయలసీమ ప్రజలను తరిమివేశారని మున్ముందు అమరావతి నుండి కూడా తరిమివేసే ప్రమాదం ఉందని అన్నారు. కనుక అమరావతిని ‘ఫ్రీ జోన్’ గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేసారు. హైదరాబాద్ విషయంలో చేసిన తప్పునే మళ్ళీ అమరావతిలో పునరావృతం చేయవద్దని ఆయన హెచ్చరించారు.
అధికార పార్టీలో ఉన్న టి.జి. వెంకటేష్ రాయలసీమలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అనేక ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి, ఇంకా తమ జిల్లాలకు ఏమి అవసరం ఉన్నాయో అవన్నీ సాధించుకొనే ప్రయత్నం చేయకుండా ప్రభుత్వాన్ని ఈవిధంగా ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే ఆయనని తెదేపా అధిష్టానం బొత్తిగా పట్టించుకోకపోవడం వలననేనని చెప్పవచ్చును. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఉండి ఉంటే బహుశః రాయలసీమ వెనుకబాటు తనం గురించి మాట్లాడటం మాని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సీమలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రచారం చేసి ఉండేవారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఇప్పుడు చాలా బాధపడిపోతున్న టి.జి. వెంకటేష్ ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన గురించి మాట్లాడలేదు. రాయలసీమ వెనుకబాటు తనం గురించి కూడా మాట్లాడలేదు. మంత్రిగా ఉన్నప్పుడు తన సీమ జిల్లాలను అభివృద్ధి చేసుకోలేదు. తనకి మంత్రి పదవి దక్కితే రాయలసీమలో సమస్యలు తీరిపోయినట్లే భావిస్తారేమో? అధికారం కోసం ఆశపడి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకొంటున్న స్వార్ధ రాజకీయపరుల మాటలను ప్రజలు నమ్మినట్లయితే అప్పుడు దేశంలో ఒక్కో జిల్లాని, గల్లీని ఒక్కో రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది.