సుమారు పదేళ్ళపాటు ప్రతిపక్ష బెంచీలలో కూర్చొని అధికారం కోసం తపస్సు చేసిన చంద్రబాబు నాయుడుకి జ్ఞానోదయం అయింది. గతంలో తను అధికారంలో ఉన్నప్పుడు ‘వ్యవసాయం దండగ’ అని అన్నందుకే తను అధికారంలోకి రాలేకపోతున్నాననే సంగతి అర్ధమయింది. దానితో నిరుడు జరిగిన ఎన్నికలలో డ్వాక్రా, పంట రుణాలు, చేనేత రుణాలు, బంగారు నగలపై తీసుకొన్న రుణాలు అన్నిటినీ ఒక్క కలంపోటుతో మాఫీ చేసి పడేస్తానని రైతులను కన్విన్స్ చేయగలిగడంతో మళ్ళీ అధికారంలోకి రాగలిగారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఫైళ్ళ మీద సంతకాలయితే పెట్టారు కానీ ఇంతవరకు ఏ రుణాలను మాఫీ చేయలేదు. మొదట్లో రుణాల మాఫీ గురించి నిత్యం మాట్లాడే చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు ఇప్పుడు క్రమేపీ వాటి గురించి మాట్లాడటం తగ్గించేసారు. వాటి గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే ప్రజలకు వాటిని అంతగా గుర్తు చేసినట్లవుతుందనే ఉద్దేశ్యంతోనే మాట్లాడటం లేదేమో? కానీ ప్రభుత్వం ఎప్పుడయినా ఏదో మొక్కుబడిగా సొమ్ము చెల్లించినప్పుడు మాత్రం మరిచిపోకుండా దాని గురించి చాలా గొప్పగా చెప్పుకొంటున్నారు. కానీ ఆ చిన్న మొత్తాలు అప్పుల మీద వడ్డీలకు కూడా సరిపోవడం లేదని రైతులే చెపుతున్నారు. ఒకేసారి రుణాలన్నీ మాఫీ చేసేస్తామని చెప్పి ఈవిధంగా చేయడంతో రైతులు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ సంగతి చంద్రబాబు నాయుడుకి తెలియదనుకోలేము. రైతులకిచ్చిన ఆ హామీని ఏవిధంగా నెరవేర్చాలో ఆలోచించకుండా చంద్రన్న యాత్రలు, భరోసా యాత్రలు చేస్తూ రైతులను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు.
ప్రతిపక్ష బెంచీలలో కూర్చొని పదేళ్ళపాటు చేసిన తపస్సులో తను తెలుసుకొన్న సత్యాలన్నీ అధికారంలోకి రాగానే మళ్ళీ మరిచిపోయి ఐటి, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాలపై తనకున్న మమకారాన్ని చాటుకొంటూ రైతుల భూములను లాక్కోవడం మొదలుపెట్టారు. దానికి ఆయన ల్యాండ్ పూలింగ్ అనే అందమయిన పేరు పెట్టుకొన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా, వైద్య సంస్థలు, ఐటి, పరిశ్రమలు, మౌలికవసతుల అభివృద్ధి కోసం భూమి అవసరమే. కానీ దానికి సారవంతమయిన రైతుల భూములే కావాలనుకోవడం చాల తప్పు. మంచి నీటివసతి కలిగి ఏడాదికి రెండు మూడు పంటలు పండుతున్న సారవంతమయిన భూములంటేనే ఆయన ఎక్కువ ఇష్టపడుతున్నారు. వాటిపైనే ఆయన ‘కాంక్రీట్ పంటలు’ పండించాలనుకొంటున్నారు. దానికి ‘అభివృద్ధి’ అనే పేరు పెట్టుకొన్నారు. కానీ ఆయన రైతు పక్షపాతి కావడంతో ఆ అభివృద్ధి అంతా రైతుల భూముల్లోనే చేయాలనుకొంటున్నారు తప్ప రాజకీయ నాయకుల, ప్రభుత్వ భూముల జోలికిపోవడం లేదు.
రాజధాని, గన్నవరం, భోగాపురం విమానాశ్రయాలు, బందరు పోర్టు ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నిటినీ ఆయన రైతుల సారవంతమయిన భూముల్లోనే చేపడుతున్నారు. బహుశః ఆయన చెపుతున్న మిషన్ 2020లో భాగంగా 2020సం.నాటికి రాష్ట్రంలో “రైతు, వ్యవసాయం” అనే రెండు ముక్కలు వినపడకుండా చేయాలనే ఆలోచనలో ఉన్నారేమో తెలియదు. కానీ ఆ అభివృద్ధి కార్యక్రమాల కోసం రైతులను ఆయన ఇప్పుడు రోడ్డున పడేస్తే, ఏదో ఒకనాడు వారు కూడా మళ్ళీ అదే పని చేస్తారు. అప్పుడు మళ్ళీ ప్రతిపక్ష బెంచీలలో కూర్చొని అధికారం కోసం ఎంత తపస్సు చేసినా ప్రయోజనం ఉండదు.