ప్రజలందరూ ఏదో ఒక రాజకీయపార్టీని అభిమానించడమో లేక కొంత సానుకూలంగా ఉండటమో సర్వసాధారణమయిన విషయమే. అందుకు మీడియా ప్రతినిధులు కూడా అతీతులుకారు. కానీ వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ, తాము పనిచేస్తున్న మీడియా యాజమాన్య రాజకీయ అభిప్రాయాలకి అనుగుణంగానే సమాచారాన్ని అందించే దుస్సంప్రదాయం నేడు మీడియాలో పాతుకుపోయింది. అందుకు కారణం మీడియాకి, రాజకీయ పార్టీలకి మధ్య ఉండే సన్నటి గీత చెరిగిపోవడమే.
వైకాపా, తెరాస వంటి రాజకీయ పార్టీలు స్వంత మీడియాను నడుపుకొంటుంటే మరి కొన్ని మీడియా సంస్థలు ఏదో ఒక రాజకీయ పార్టీకి ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ‘బాకా మీడియా’గా మారిపోయాయి. అటువంటి మీడియా సంస్థలలో పనిచేస్తున్నవారు వాటికి అనుగుణంగానే వ్యవహరించక తప్పదు. ఉదాహరణకి సాక్షి మీడియాలో పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయుడు దేవులపల్లి అమర్ నిన్న జగన్ దీక్షా శిభిరానికి వచ్చినపుడు మీడియాతో మాట్లాడిన మాటలు వింటే ఆ విషయం అర్ధం అవుతుంది.
“జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్నారు తప్ప తన కోసం కాదు. ఆయన ఆరోగ్యం చాలా వేగంగా క్షీణిస్తోంది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదు. కనీసం ఇప్పటికయినా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. లేకుంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చును. జగన్మోహన్ రెడ్డి దీక్షని స్థానిక మీడియా బాగానే కవర్ చేస్తోంది. కానీ జాతీయ మీడియా అసలు పట్టించుకోవడం లేదు. ఆయన దీక్ష గురించి జాతీయ మీడియా కవరేజ్ చేసినప్పుడే అది కేంద్రప్రభుత్వం దృష్టికి వెళుతుంది. అప్పుడే అది స్పందిస్తుంది. కానీ జాతీయ మీడియా జగన్ దీక్షను ఎందువల్ల పట్టించుకోవడం లేదో తెలియడం లేదు,” అని అన్నారు.
నిజానికి అమర్ పేరున్న సీనియర్ పాత్రికేయుడు. కానీ ఆయన కూడా ఒక వైకాపా నేతలాగ మాట్లాడారు. అందుకు కారణం ముందే చెప్పుకొన్నాము. సీనియర్ పాత్రికేయుడయిన ఆయన కూడా ఒక రాజకీయపార్టీకి ఇంత బహిరంగంగా మద్దతుగా మాట్లాడటం చూస్తే మీడియాలో పనిచేసే వారిపై యాజమాన్యం ప్రభావం ఏవిధంగా ఉంటుందో అర్ధం అవుతుంది. జగన్ దీక్షను జాతీయ మీడియా అసలు పట్టించుకోలేదని అమర్ ఆవేదన వ్యక్తం చేసారు.
నిజమే. కానీ జగన్ ఏదో ఒక సమస్య కోసం నెలకి ఒకటి రెండుసార్లయినా దీక్షలు చేస్తుంటే ఆయన దీక్షను జాతీయ మీడియా సీరియస్ గా ఎందుకు తీసుకొంటుంది? అయినా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశంలో అనేక రాష్ట్రాలలో..జిల్లాలలో..గ్రామాలలో ఎవరో ఒకరు నిత్యం ఈవిధంగా దీక్షలు చేస్తూనే ఉంటారు. వారందరి దీక్షల గురించి వ్రాయడం మొదలుపెడితే ఇక వేరే న్యూస్ వ్రాయడానికి ఉండదు. ఆనాడు కేసీఆర్ దీక్షని చాలా బాగా కవర్ చేసిన జాతీయ మీడియా నేడు జగన్ దీక్షని ఎందుకు పట్టించుకోవడం లేదు? అనే ప్రశ్నకు వైకాపా నేతలు నిజాయితీగా సమాధానం చెప్పుకోగలిగితే కారణం ఏమిటో వారికే అర్ధం అవుతుంది.