నాలుగు జిల్లాల్లో, 138 మండలాల్లో, కోటిమంది జీవన విధానాల కాళ్ళు , చేతులు, నడుము, వెన్నులను చావగొట్టిన గాలివాన ”హుదూద్” తెల్లారిపోయి ఏడాది అయింది. ఆ పీడకల నుంచి మేల్కొనగానే కష్టనష్టాలు దుఖమయ్యాయి. దుఖం ఆగ్రహమయ్యింది. ఆగ్రహం ఆక్రోశంగా మారింది. సాయం అందలేదనో, సదుపాయం చాలలేదనో, కష్టాన్ని పట్టింకోలేదనో, నష్టాన్ని చూడనేలేదనో ఆ ఆక్రోశం ఏడాదిగా కుమిలిపోతూనే వుంది. అయినా- ఆశను కూడగట్టుకుని, సంకల్పాన్ని నిబ్బరపరచుకుని, కృషిని కేంద్రీకరించుకుని గాయపడిన జీవితాలు ఏడాదిగా ముందడుగు వేస్తూనే వున్నాయి. ఉత్తరాంధ్ర, ప్రధానంగా విశాఖ నగర రూపురేఖలను చిన్నాభిన్నం చేసిన ప్రచండ తుపాను ‘హుదూద్’ ప్రాంతాల పునర్నిర్మాణం మొదలుకాలేదు. బాధితుల సహాయ, పునరావాసాలపై ప్రభుత్వం హామీలు నెరవేరలేదు. కంటి తుడుపు చర్యలు, ప్రచార్భాటం తప్ప ఒక్క పటిష్ట, శాశ్వత చర్య లేదుగాక లేదు.తుపానుకి చితికపోయిన విశాఖ మురికివాడలను, మత్స్యకార ప్రాంతాలను చూస్తే ప్రచారంలోని డొల్లతనం ప్రత్యక్షమౌతుంది.
‘హుదూద్’ 22 వేల కోట్లరూపాయలు పబ్లిక్, ప్రయివేటు ఆస్ధులను ధ్వంసం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే చేసి వెయ్యి కోట్ల రూపాయల అత్యవసర సహాయం ప్రకటించారు.అందింది 750 కోట్ల రూపాయలకంంటే కాస్త తక్కువే. ఇందులో విపత్తు నిధులనుంచి రాష్ట్రానికి చట్టప్రకారం రావలసింది 350 కోట్ల రూపాయలు. దేశవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల ప్రచారాన్ని సాధించుకున్న నరేంద్రమోదీ, అడిగించకునీ, అడిగించుకునీ చివరికి విదిలించింది 400 కోట్ల రూపాయలు మాత్రమే! సహాయచర్యలపై 1,800 కోట్లు రూపాయలు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేకసార్లు ఘనంగా ప్రకటించుకున్నారు.జరిగిన నష్టంతో పోల్చితే సర్కారు విదిల్చింది పిసరంత. అందులోనూ అవినీతి పై తీవ్రమైన ఫిర్యాదులు వున్నాయి.
ఏడాదైనా ”తక్షణ సాయం” అందని బాధితులు వేలల్లో వున్నారు.నాలుగున్నర లక్షల గృహాలు ధ్వంసం కాగా ఒక్క పక్కా ఇల్లు నిర్మించలేదు. మోడల్ కాలనీలను కట్టిస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం ఇంతవరకూ కనీసం డిజైన్లనైనా సిద్ధం చేయలేదు.పడవలు, తెప్పలు కోల్పోయిన మత్స్యకారులకు సహాయం ఇవ్వలేదు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించిన రైతులకు, గిరిజనులకు పూర్తి స్థాయిలో ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. రుణ మాఫీ వంకతో బ్యాంకులు రైతుల అప్పులను రీషెడ్యూల్ చేయలేదు. వృత్తిదారుకు, ఆటో, రిక్షా, తోపుడు బండ్ల వాళ్లకూ సాయం చేయలేదు. పరిశ్రమలకు బీమా కంపెనీల నుంచి అరకొర సాయం తప్ప సర్కారు ఇచ్చిందేమీ లేదు. బ్యాంకులు సైతం ఆదుకోలేదు. ప్రభుత్వరంగ పరిశ్రమలు తుపానుకు భారీగా నష్టపోయాయి. కోలుకోవాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం ఎంతైనా అవసరం. విశాఖ నగరంలో ప్రధాన కూడళ్లల్లోని రెండు పర్యాటక ప్రదేశాలను పునరుద్ధరించి ఇదే పునరావాసం అని సర్కారు వేడుకలు చేసుకోవడం వంచనే.
61 మంది ప్రాణాలు తీసి 22 వేల కోట్ల నష్టాలు మిగిల్చిన పెను విషాదంలో కూడా ప్రచార కోణం వెతుక్కొని హామీలన్నింటినీ నెరవేర్చామని వార్షిక సంబరాలు చేసుకోవడం జుగుప్సాకరం .కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకున్న బిజెపి, టిడిపిలు విభజన హామీలకు మాదిరిగానే హుదూద్ వాగ్దానాలనూ తుంగలో తొక్కాయి. ఆ రెండు పార్టీల బంధం రాజకీయలబ్ధికి, నాయకుల స్వప్రయోజనాలకు మినహా బాధిత ప్రజల ప్రయోజనాల కోసం కాదని ‘హుదూద్’ కూడా తేల్చేసింది. తుపానుపై పౌర సమాజం స్పందించిన స్థాయిలో కూడా ప్రభుత్వాలు స్పందించలేదు. చిన్న పిల్లలు సైతం విరాళాలు సేకరించి అందజేయగా, దాతల నుంచి సమకూరిన 260 కోట్ల రూపాయలను కూడా బాధితుల పునరావాసానికి రాష్ట్రప్రభుత్వం ఇంకా ఖర్చుచేయలేదు. అంతలోనే ఏడాది గడచిపోయింది. మొదలేకాని పనుల స్ధితిని సమీక్షించుకుని, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించడానికి బదులు వార్షికోత్సవ సంబరాలకు తెగబడటం అతి హేయం. బాధితులు ఏమనుకుంటారా అన్న సంకోచం కూడా లేకపోవడమంటే సమస్యల్ని తివాచీ కిందికి ఊడ్చెయ్యడమే ప్రభుత్వ విధానమా అన్న అనుమానం తలఎత్తుతోంది.