హైదరాబాద్: ‘రుద్రమదేవి’ విడుదలైన వారంరోజులకే బ్రూస్లీ చిత్రాన్ని విడుదల చేయటంపై వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. రుద్రమదేవి చారిత్రక చిత్రమని, దానిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వెంటవెంటనే పెద్ద చిత్రాలను విడుదల చేయకుండా ఉండాల్సిందంటూ దర్శకరత్న దాసరి నారాయణరావు పరోక్షంగా బ్రూస్లీ చిత్రాన్ని గురించి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకూడా బ్రూస్లీ చిత్రం విడుదల వేయాలని చిరంజీవికి లేఖ రాశారు. ‘రుద్రమదేవి’లో కీలకమైన గోన గన్నారెడ్డి పాత్రను పోషించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ వివాదంపై ఇవాళ ట్విట్టర్లో స్పందించారు. బ్రూస్లీ చిత్రాన్ని మరో వారం రోజులు వాయిదా వేసుకోలేదంటూ నిర్మాతను విమర్శించటం భావ్యం కాదని, అక్టోబర్ 16న విడుదల చేస్తామని వారు ఎప్పుడో ప్రకటించారని పేర్కొన్నారు. రుద్రమదేవి సెప్టెంబర్ 4న విడుదల అవుతుందని ఆ చిత్ర నిర్మాతలు అంతకుముందు ప్రకటించబట్టే బ్రూస్లీ చిత్ర నిర్మాతలు నెలరోజుల తర్వాత రిలీజ్ పెట్టుకున్నారని వివరించారు. బ్రూస్లీ ఈ నెల 16న విడుదల అవుతుందని తెలిసికూడా రుద్రమదేవి చిత్రాన్ని సరిగ్గా వారం రోజులముందు 9వ తేది విడుదల చేశారని, ఇప్పుడు బ్రూస్లీ చిత్ర నిర్మాతలను నిందించటం సరికాదని ట్వీట్ చేశారు. మొత్తం మీద తన చిత్రంకంటే చరణ్ చిత్రానికే బన్నీ ప్రాధాన్యమిచ్చినట్లు కనబడుతోంది. మరి మెగా స్టార్ అండతో ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకున్నాడు కాబట్టి చరణ్‌కు ప్రాధాన్యమివ్వక తప్పదుగా!