హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ అక్రమాస్తుల కేసులో నిందితుడుగా ఉన్నారు. ఒక ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ లైసెన్స్ రెన్యువల్ చేసేందుకు ఆ సంస్థ నుండి భారీగా లంచం తీసుకొన్నట్లు మరో అభియోగం కూడా ఎదుర్కొంటున్నారు. ఆయనపై సీబీఐ చార్జ్ షీట్ నమోదు చేసి అరెస్ట్ చేయాలనుకొంది కానీ ఆయన హైకోర్టు నుండి స్టే ఆర్డర్ పొందడంతో సీబీఐ అధికారులు హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకి వెళ్ళారు. ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్ దత్తు కూడిన ధర్మాసనం సీబీఐ పిటిషన్ న్ని విచారణకు స్వీకరించింది. ఈకేసుపై రేపే అత్యవసరంగా విచారణ చేపట్టి ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ని అరెస్ట్ చేసేందుకు అనుమతించాలనే సీబీఐ వాదనను తిరస్కరించింది. ఇదేమీ అంత అత్యవసరమయిన విషయం కాదని దసరా శలవుల అనంతరం ఈ కేసును విచారణకు చేపడతామని ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్ దత్తు చెప్పారు. ప్రస్తుతానికి వీరభద్ర సింగ్ అరెస్ట్ గండం గట్టెక్కినట్లే కానీ మళ్ళీ వారం రోజుల్లో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణకు చేపట్టి ఆయన అరెస్ట్ కు అనుమతిస్తే ఇక ఆయనకి కష్టాలు మొదలయినట్లే. అధికారంలో ఉన్నప్పుడు ఎంత అవినీతికి పాల్పడినా ఎవరూ ఏమీ చేయలేరనుకొనేవారికి వీరభద్ర సింగ్ కేసు ఒక గుణపాఠంగా భావిస్తే అటువంటి సహాసానికి పూనుకోరు.