ప్రముఖ హాస్య నటుడు కళ్ళు చిదంబరం ఈరోజు ఉదయం మరణించారు. ఆయన వయసు 70. గత కొంత కాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించారు. ఆయన మొదట వైజాగ్ పోర్టులో ఉద్యోగిగా చేసేవారు. ఆ తరువాత నాటక రంగంపై ఆసక్తి పెంచుకొని దానిలోకి ప్రవేశించారు. సినీ రంగంలో ప్రవేశించక ముందు సుమారు 12 ఏళ్ళపాటు నాటక రంగానికి సేవలు అందించారు. నాటక రంగం కళాకారులను ఆదుకోవడానికి ఆయన సకల కళల సమాఖ్యను ఏర్పాటు చేసారు. కానీ క్రమంగా ప్రజలలో నాటకరంగం పట్ల అభిరుచి, ఆదరణ తగ్గడంతో నాటక రంగంలో ఉన్న మిగిలినవారిలాగే ఆయన కూడా తీవ్ర ఆర్ధిక సమస్యలలో చిక్కుకొన్నారు. సరిగ్గా అదే సమయంలో ఆయనకు సినీ రంగంలో ప్రవేశించే అవకాశం దక్కడంతో మళ్ళీ కొంత తెరుకొన్నారు.
ఆయన నటించిన మొట్ట మొదటి చిత్రం పేరు ‘కళ్ళు.’ తన మొట్ట మొదటి చిత్రానికే ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమయిన నంది అవార్డు అందుకోవడం విశేషం. అప్పటి నుండి ఆయన ‘కళ్ళు చిదంబరం’ గానే ప్రసిద్దులయ్యారు. ఆయన అసలు పేరు కొల్లూరు చిదంబరం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, స్వర్గీయ ఈ.వి.వి. సత్యానారాయణ తీసిన చాలా సినిమాలలో ఆయన ఉన్నారు. మనీ, గోవిందా..గోవిందా, అమ్మోరు, మృగరాజు, పెళ్లి పందిరి, శ్వేత నాగు, శివంగి, గంగపుత్రులు, కాలచక్రం, తొలి పాట, ప్రేమకు సై తదితర అనేక సినిమాలలో నటించారు. 2013లో విడుదలయిన సాయి సంకల్పం ఆయన చివరి సినిమా. ఆయన అనేక సినిమాలలో నటించినప్పటికీ ఆయన ఆర్ధిక స్తోమత మాత్రం ఎప్పుడూ అంతంత మాత్రంగానే ఉండేది. అయినప్పటికీ ఆర్ధిక సమస్యలతో బాధపడుతున్న నిరుపేద రంగస్థల నటులకు ఉదారంగా సహాయం చేస్తుందేవారు. ఆయన మృతికి తెలుగు సినీ పరిశ్రమ, నాటక రంగానికి చెందిన వారు చాలా మంది తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు విశాఖపట్నంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి..