హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి ప్రతిష్ఠాత్మకంగా జరుగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవకూడదని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఆయన సొంతపార్టీలోని కోస్తాప్రాంత కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. రాజధాని అనేది అందరిదీ అని, ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవటంవలన వైసీపీ పార్టీ ప్రజలకు దూరమైపోతుందని వారు భావిస్తున్నారు. అసలు విజయవాడ-గుంటూరు ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి జగన్ వ్యతిరేకించటం వలనే ఇటీవల జగన్ దీక్షకు మద్దతు పెద్దగా లభించలేదని, ఇప్పుడు ఈ బాయ్‌కాట్ నిర్ణయం వలన వ్యతిరేకత పెరుగుతుందని వారు వాదిస్తున్నారు. జగన్‌ను కలిసి నిర్ణయాన్ని మార్చుకోమని అడుగుదామని కొందరు భావిస్తున్నారు.
నూతన రాజధానిని కృష్ణా-గుంటూరు జిల్లాల ప్రాంతంలో నిర్మించాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని బలంగా వ్యతిరేకించలేదని రాయలసీమలోని వైసీపీ శ్రేణులలో జగన్‌పై ఇప్పటికే అసంతృప్తి బలంగా ఉంది. ఆ కారణంగానే జగన్ ఇటీవల గుంటూరులో చేసిన దీక్షకు రాయలసీమలో స్పందన కొరవడింది. ఇటు కోస్తాలోనేమో బాయ్‌కాట్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తమవటం… మొత్తం మీద చూస్తే వైసీపీలో రెండుప్రాంతాలలోనూ అసంతృప్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి జగన్ దీనిని ఎలా డీల్ చేస్తారో చూడాలి.