2022లో రాబోతున్న అతి పెద్ద సినిమాల్లో ఆర్.ఆర్.ఆర్ ఒకటి. ఈ సినిమాకోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి పెద్ద దెబ్బ పడింది. అందులోనూ బాలీవుడ్ లోనూ. కోవిడ్ థర్డ్ వేవ్ ఉధృతిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా.. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించింది. అంతే కాదు.. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన పెడుతూ జీవో జారీ చేసింది. ఇది నిజంగా బాలీవుడ్ కి పెద్ద దెబ్బ.
ఆర్.ఆర్.ఆర్ జనవరి 7న విడుదల కాబోతోంది. అది పాన్ ఇండియా సినిమా. బాలీవుడ్ నుంచి భారీ వసూళ్లను ఆశిస్తున్న ఈ తరుణంలో అక్కడ 50 శాతం ఆక్యుపెన్సీ విధించడం, వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పైగా నైట్ కర్ఫ్యూ విధిస్తే కీలకమైన సెకండ్ షో పోగొట్టుకున్నట్టే. మహా రాష్ట్రలో మొదలైతే క్రమంగా మిగిలినరాష్ట్రాలూ ఈ విషయంపై ఓనిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నైట్ కర్ఫ్యూ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది కేంద్రం. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఒమెక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. జనవరి మొదటి వారం నుంచి… నిబంధనలు కఠినతరం చేసే అవకాశాలు ఉన్నాయి.