ప్రభుత్వ సంస్థల్లోనూ, ప్రైవేటు సంస్థల్లోనూ పందికొక్కులు ఉంటారు. లక్షల కొద్దీ డబ్బుని తినేస్తుంటారు. ఇలాంటి ఓ కుంభకోణం ప్రముఖ టీవీ ఛానల్ జెమినీలో వెలుగులోకి వచ్చింది. ఓ సీరియల్ విషయంలో కొంతమంది ఉద్యోగులు కలసి కోట్లకు కోట్లు డబ్బుని దోచేశారు.
ప్రముఖ దర్శకుడు ఎస్.వీ. కృష్ణారెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో `శుభలగ్నం 2` అనే సీరియల్ జెమినీలో కొద్ది వారాలు ప్రసారమై ఆగిపోయింది. రేటింగులు బాగానే ఉన్నా – ఈ సీరియల్ ఎందుకు ఆగిపోయిందో వీక్షకులకు అర్థం కాలేదు. అనివార్య కారణాల వల్ల ప్రసారం చేయలేకపోతున్నాం అని జెమినీ వర్గాలు చెప్పాయి. అయితే దీని వెనుక వేరే కారణం ఉంది.
ఈ సీరియల్ పేరు చెప్పి లక్షలకు లక్షలు దోచుకున్నారని సమాచారం. రోజుకి రెండు లక్షలకు మించి బడ్జెట్ అవ్వకపోయినా, కేవలం 15 ఎపిసోడ్లు తీసి మూడు కోట్ల బిల్లు చూపించారట. సినిమా స్థాయిలో ప్రతీ ఆర్టిస్టుకీ ఓ కార్ వాన్ తెప్పించారని, రోజుకి పదివేలు పారితోషికం ఇచ్చి రూ.50 వేలుగా చూపించారని, అవ్వాల్సిన బడ్జెట్ కంటే పదింతలు ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేశారని ఆరోపణలు వచ్చాయి. వీటిపై యాజమాన్యం చురుగ్గా స్పందించింది. అసలు లెక్కలు చెప్పాలంటూ ఆరా తీసింది. చివరికి ముగ్గురుని దోషులుగా నిర్దారించి వాళ్లని విధుల నుంచి తప్పించి అప్పటి కప్పుడు ఈ సీరియల్కి పుల్ స్టాప్ పెట్టించింది.