తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన జరిగింది. ఆ బాధితుడు ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ , మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు. అలాగే కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తరుచూ భార్య కొడుతుందని అర్థనగ్నంగా పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఓ వ్యక్తి భార్యపై ఫిర్యాదు చేశారు. అయితే వీటన్నింటినీ కామెడీగానే చూస్తున్నారు అంతా.
సమాజంలో అనాదిగా మగవాడు కొడతాడు.. ఆడది పడుతుందన్న ఓ అభిప్రాయం ఉంది. తన భార్య కొడుతోందని చెబితే సమాజం నవ్వుతుదంని చాలా మంది బయటపడరు. చట్టాలు కూడా గృహహింస కింద మగవాళ్లనే నిందితులుగా చేస్తాయి కానీ ఆడవాళ్లను కాదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ చాలా మంది తెరపైకి వస్తున్నారు. తమ భార్య కొడుతోందని బ యటపడుతున్నారు. నిజానికి సమాజంలో గృహ హింసలో ఆడవాళ్లు ఎంత వేధింపులకు గురవుతున్నారో.. మగవాళ్లు కూడా అలాగే వేధింపులకు గురవుతున్నారు. కానీ వారిని కమెడియన్లుగా చూస్తూండటంతో చాలా మంది బాధను భరిస్తూ వస్తున్నారు.
వివాహేతర బంధం పెట్టుకుని భర్తను చంపిన భార్య పేరుతో ఎన్నో వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి నేరాలు లెక్కలేనన్ని జరుగుతున్నాయి. ఇలాంటి ఘోరం జరగక ముందే ఓ భర్త బయటకు వచ్చి తన భార్యపై పోరాటం చేస్తే అతన్ని ఖచ్చితంగా దోషిగా చూస్తోంది సమాజం. మీడియా, సోషల్ మీడియా కామెడీ చేస్తున్నాయి. ఈ కారణంగా గృహహింసకు గురయ్యే మగవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి వారు తరచూ బయటకు రావడమే ఇప్పుడు కనిపిస్తున్న మార్పు. మరి అలాంటి మగ బాధితుల గోడును చట్టాలు పట్టించుకుంటాయా లేదా అన్నది కీలకం.